ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు యాక్టర్ హైపర్ ఆది. గురువారం శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన యువశక్తి సభకు ఆయన హాజరయ్యాడు. ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరికీ ఒక గోల్ ఉంటుంది. నాకు ఓ గోల్ ఉంది. అదేంటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోట ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను అనే మాట వినాలని ఉందన్నాడు. ఏపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ను తిట్టే శాఖ కూడా పెట్టుకోవాలని ఎద్దేవా చేశాడు. 150 మంది ఎమ్మెల్యేలు ఒక్కడి ముందు భయపడుతున్నారని దుయ్యబట్టాడు. ఆ శాఖ పెట్టుకుని అదే పనిగా తిట్టుకోండి.. శాఖల పరువు తీస్తున్నారు.
మీ శాఖల గురించి పది నిమిషాలు చెప్పమంటే మీరు పదో సెకనులోనే దొరికిపోతారు అంటూ విమర్శించారు. పవన్ కళ్యాణ్ కొంత కాలం కష్టపడితే ఎలాంటి పదవైనా వస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ అనే పదవి మాత్రం ఎవరికీ రాదన్నారు. వారాహి బండిని అడ్డుకుంటారా? ఆయనకు తిక్కరేగితే పాదయాత్ర చేస్తారు. అప్పుడు మీరు కాశీయాత్రకు పోవాల్సిందేనని పంచ్ లు వేశారు. పవన్ కళ్యాణ్ జనాల పక్షాన ఉన్నాడు కాబట్టే జనసేనాని అయ్యాడన్నారు. ఈ మధ్య ప్యాకేజీ అంటున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రేమకు లొంగుతాడే తప్ప.. ప్యాకేజీకి కాదన్నారు.
పవన్ రెండు చోట్ల ఓడిపోయారని ఎప్పుడూ విమర్శలు చేస్తూ ఉంటారు. రెండు చోట్ల ఓడిపోతేనే ఇంతమంది ప్రజలకు సహాయం చేస్తున్నారంటే.. గెలిస్తే మీ కష్టాన్ని కంపోడ్ వాల్ కూడా దాటనివ్వడని పంచ్ లు వేశారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ ను విమర్శించి.. పాపులర్ అయిపోవాలనుకునేవాడే! మీ పాపులారిటీ కోసం ఆయన పర్సనాలిటీ దెబ్బతినేలా మాట్లాడితే ఈసారి జనసేన కొట్టే దెబ్బకు మీ అబ్బ గుర్తొస్తాడు!
నిలకడలేని రాజకీయం అంటున్నారు.. మీరేమో వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాలు చేయొచ్చా? కానీ ఆయన మాత్రం సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేయకూడదా? అని ప్రశ్నించారు. ఒక్కడి నిజాయతీని తట్టుకోలేక 151 మంది భయపడిపోతున్నారు.. అదేనా మీ రాజకీయం? పవన్ పై కుల ముద్ర వేస్తున్నారు.. నన్ను కన్న నా తల్లిపై ఒట్టేసి చెబుతున్నా.. పవన్ లాంటి నీతిమంతుడైన రాజకీయ నాయకుడిని మరొకరిని చూడలేరు అంటూ చెప్పుకొచ్చాడు హైపర్ ఆది.