నెల్లూరు జిల్లా రాజకీయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. వైకాపాలో కొనసాగడం ఇష్టం లేక మౌనంగా నిష్క్రమిద్దాం.. అని అనుకున్నా అన్నారు. కానీ నా వ్యక్తిత్వాన్ని శంకించేలా మాట్లాడుతున్నారని.. అందుకే సమాధానం చెప్పాల్సిన అవసరం తలెత్తిందని పేర్కొన్నారు.
“మా బావ కాకాణి గోవర్థన్ రెడ్డి కూడా మాట్లాడాడు. బంధువునని.. మాట్లాడకపోతే బాగుండేదని అలా అంటున్నాడు. గతంలో నీకు వీర విధేయుడినే.. ఇప్పుడు కాదు..నన్ను నమ్మకద్రోహం అంటున్నావు.. నిన్ను జెడ్ పి ఛైర్మన్ చేసిన ఆనం రాం నారాయణ రెడ్డిని ఎందుకు విభేధించావు” అని కోటం రెడ్డి ప్రశ్నించారు.
“వైఎస్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత లేదు. జగన్ ఓదార్పు యాత్ర అప్పుడు ఏమీ చెప్పావు. కాంగ్రెస్ మహా సముద్రం..జగన్ ఒక నీటి బొట్టు అన్నావు. జగన్ తో నడిస్తే ఎలాంటి భవిష్యత్ ఉండదని చెప్పావుగా. పొదలకూరు లో వైఎస్ విగ్రహం పెట్టనీయకుండా అడ్డుకున్నావు. వైసిపి ఎమ్మెల్యేగా వుంటూ చంద్రబాబు కాళ్లకు దండం పెట్టిందెవరు..నువ్వు కాదా.. ఇది అందరికీ తెలుసు.. “అని కోటం రెడ్డి మాటకు మాట సమాధానం ఇస్తానని క్లారిటీ ఇచ్చారు.
నకిలీ పత్రాల కేసులో జాగ్రత్తగా ఉండు.. అన్ని వేళ్లు నీ వైపే చూస్తున్నాయని ..వైసీపీలో మార్కులు కావాలంటే నన్ను తిట్టు అని..సజ్జలను విమర్శిస్తే మా బావకు కోపం వచ్చిందని ఎద్దేవా చేశారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. అవన్నీ సజ్జలనే చేయిస్తున్నాడని తనకు బాగా తెలుసని అన్నారు కోటం. తన పై కావాలనే కిడ్నాం కేసు పెట్టారని.. ఇక నుంచి తన నుంచి కూడా ఫేక్ వీడియో కాల్స్ వస్తాయి.. చూస్తుండడని కోటం రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.