పంజాబ్ పోలీసులను గడగడలాడిస్తున్న ఖలిస్తాన్ నేత అమృత్ పాల్ సింగ్..తాను లొంగిపోయే ప్రసక్తే లేదని చెబుతున్నాడు. గత 13 రోజులుగా ఖాకీల కళ్ళు గప్పి రకారకాల వేషాలతో తిరుగుతున్న సింగ్.. యూట్యూబ్ లో వీడియోను విడుదల చేస్తూ.. నేను లొంగే ప్రసక్తి లేదని స్పష్టం చేశాడు. పోలీసులకు లొంగిపోవాలని, వారి దర్యాప్తునకు సహకరించాలని అకల్ తక్త్ జతేదార్ కోరినప్పటికీ .. ఇందుకు అమృత్ పాల్ నిరాకరించాడు.
ఇతగాడు మాటిమాటిమాటికీ పోలీసుల నుంచి ఎలా తప్పించుకుంటున్నాడని ఇటీవల పంజాబ్ హర్యానా హైకోర్టు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మీకు 80 వేలమందికి పైగా పోలీసులు, భద్రతా దళాలు ఉన్నారని, అయినా ఈ ఖలిస్థాన్ నేతను ఎందుకు పట్టుకోలేకపోతున్నారని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది.
ఎలా అయినా ఇతని కోసం గాలిస్తున్నామని, రేపో, మాపో పట్టుకుంటామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇటీవల ఢిల్లీలో ‘వింత వేషం’ లో కనబడిన అమృత్ పాల్ సింగ్ కి పాకిస్థాన్ ఐఎస్ఐ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని భావిస్తున్నారు.
లోగడ నేపాల్ పారిపోయి ఉండవచ్చునని కూడా వార్తలు వచ్చాయి. అమృత్ పాల్ పై పోలీసులు పలు కేసులు పెట్టారు. యువతను ఖలిస్తానీ ఉగ్రవాదంవైపు మరల్చేందుకు సింగ్.. డీ అడిక్షన్ సెంటర్లను నిర్వహిస్తున్నాడని, వారికి ఆయుధ వినియోగంలో శిక్షణ ఇస్తున్నాడని కూడా పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.