కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న సీనియర్ నేత శశిథరూర్.. తను పోటీ నుంచి ఉపసంహరించుకోవచ్ఛునని వచ్చిన ఊహాగానాలను కొట్టిపారేశారు. ‘నా నామినేషన్ ని ఉపసంహరించుకున్నానని ఢిల్లీలోని కొన్ని వర్గాలు పేర్కొన్నాయి.ఇవి నా వరకు వచ్చాయి.. కానీ అలాంటి యోచనే లేదు’ అని ఆయన శనివారం స్పష్టం చేశారు ఓ సవాలు నుంచి తాను వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని, అసలు ఇప్పటివరకు తన జీవితంలోనే లేదని, ఇక ముందు కూడా ఉండబోదని ఆయన చెప్పారు.
ఇది ఒక పోరాటమని, పార్టీలో జరుగుతున్న ఫ్రెండ్లీ పోటీ అని వ్యాఖ్యానించిన ఆయన.. నేను చివరివరకూ పోరాడుతానని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బరిలోనే ఉంటానని చెప్పారు.
ఈ నెల 17 వ తేదీన వచ్చి తనకు ఓటు వేయాల్సిందిగా శశిథరూర్ డెలిగేట్లను కోరారు. ‘థింక్ టుమారో.. థింక్ థరూర్’ అని చమత్కరించారు. నేను వైదొలగుతున్నట్టు వదంతులు ఎలా వచ్చాయో ఆశ్చర్యంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు.
ఇక పోటీలో ఉన్న మరో సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. గాంధీభవన్ లో ఆయనకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నానని, నాకు ఓటు వేయాలని పీసీసీ సభ్యులను కోరేందుకు ఇక్కడికి వచ్చానని ఖర్గే చెప్పారు. ఇప్పుడు తాను ఐదోసారి పోటీలో ఉన్నానని తెలిపారు. ఇప్పటికే అనేకమంది సీనియర్ నేతలు తనకు మద్దతు పలికినట్టు ఆయన వెల్లడించారు.