నూతన సచివాలయం లో అగ్నిప్రమాదం ఘటనపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ తన స్టైల్ లో స్పందించారు. అంబేడ్కర్ సెక్రటేరియట్‌ను కేసీఆర్ పుట్టిన రోజున ప్రారంభించడం ఏంటని ప్రశ్నించారు. వాస్తు బాగాలేదని సెక్రటేరియట్ కూలగొట్టడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
”నేను వద్దన్నాను, దేవుడు వద్దు అనుకున్నాడు. అందుకే సెక్రటేరియట్ కాలిపోయింది. నాతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది. దేవుడు కూడా కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్నాడు. దేవుడికి నచ్చకనే సెక్రటేరియెట్‌కు వ్యతిరేకంగా నిలబడ్డాడు” అంటూ వ్యాఖ్యలు చేశారు. అవినీతి ఎంతో కాలం చెల్లదని… కేసీఆర్ ఇప్పటికైనా పశ్చాత్తాపడి మారాలని సూచించారు. కేసీఆర్ ఈసారి ముఖ్యమంత్రిగానే గెలవరని.. ఇక ప్రధాని ఏం అవుతారని ఆయన ఎద్దేవా చేశారు..
అంబేడ్కర్ జయంతి రోజే సెక్రటేరియట్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పేరు ఒకరిది… పండు ఒకరిదా అని నిలదీశారు. సచివాలయం ప్రారంభంపై హైకోర్టులో పిల్ వేసినట్లు తెలిపారు. అమరవీరుల స్తూపం దగ్గరకు వెళ్లనీయకుండా అడ్డుకోవడంపైనా పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న సెక్రటరియెట్ వెళ్తే కూడా అడ్డుకున్నారని అన్నారు. కేసీఆర్.. తెలంగాణలో ఈ గుండాయిజం ఏంటని ప్రశ్నించారు. ”నన్ను హైదరాబాద్, తెలంగాణాలో బ్యాన్ చేద్దామని అనుకుంటున్నారా”అంటూ కేఏ పాల్ మండిపడ్డారు.
మరో వైపు కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి కాంగ్రెస్ బృందం బయల్దేరింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో షబ్బీర్ అలీ, మల్లు రవి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొత్త సచివాలయం వద్ద హైటెన్షన్ నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులు నూతన సెక్రటరీయేట్ వద్ద మోహరించారు.
కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ..కాంగ్రెస్ పార్టీ జోహర్లు అంటూ నినాదాలు చేశారు. మేము శాంతియుతంగా సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాదం విషయం గురించి నిజనిర్ధారణ చేద్దామంటే గాంధీ భవన్ గేట్ల వద్దే పోలీసులు ఆపేశారంటూ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. గవర్నమెంట్ అంతా అది మాక్ డ్రిల్ అని అబద్ధాలు చెబుతుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.