ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని ధీరూబాయ్ అంబానీ స్కూల్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. స్కూల్ లో టైం బాంబ్ పెట్టినట్లు కాల్ చేసిన వ్యక్తి పేర్కొన్నాడు. బాంబు ఉందనే సమాచారం ఇచ్చి కాల్ డిస్ కనెక్ట్ చేశాడు.
దీంతో వెంటనే పాఠశాల ఉపాధ్యాయులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పాఠశాల ఉపాధ్యాయుల ఫిర్యాదు ఆధారంగా ముంబయి పోలీసులు ఐపీసీ సెక్షన్లు 505(1) బి, 506 కింద గుర్తు తెలియని వ్యక్తి పై కేసు నమోదు చేశారు. బాంబు బెదిరింపు ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. బాంబ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపి తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలో ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదని పోలీసులు స్పష్టం చేశారు. అయితే బాంబు బెదిరింపు కాల్ రాగానే స్కూల్ లో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి.
కాగా దుండగుడు స్కూల్ కు రెండోసారి కాల్ చేసినట్లు పాఠశాల యాజమాన్యం ఫిర్యాదులో పేర్కొంది. తన ఆధార్, పాన్ కార్డుల వివరాలను సైతం స్కూల్ కు పంపించాడని తెలిపింది. తన పేరు విక్రమ్ సింగ్ అని నిందితుడు చెప్పాడు.. తనది గుజరాత్ అని, పాపులారిటీ సంపాదించుకునేందుకే కాల్ చేశానని తెలిపాడు. ఇలా చేస్తే మీడియాలో నా పేరు వస్తుందని..పోలీసులు అరెస్ట్ చేస్తారని..నేను ఫేమస్ అవుతా అని కాల్ చేసి చెప్పాడని స్కూల్ యాజమాన్యం ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించామని, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని ముంబై పోలీసులు తెలిపారు.
ఇక గత ఏడాది అక్టోబర్ లో హెచ్ ఎస్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ కు బెదిరింపు కాల్ వచ్చింది. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆసుపత్రిని పేల్చివేస్తామని బెదిరించాడు. దీంతో పాటు అంబానీ కుటుంబాన్ని చంపేస్తానని ఆగంతకుడు బెదిరించాడు.