టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ రోజు సిట్ ముందు విచారణకు హాజరు కావల్సి ఉండగా.. ఆయన ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. అసలు సిట్ పై తనకు నమ్మకం లేదని..తన దగ్గరున్న ఆధారాలను సిట్ కు సమర్పించేది లేదని లేఖ ద్వారా సిట్ కు స్పష్టం చేశారు.
తాను ముందు నుంచి పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని చెబుతున్నానని.. తన దగ్గరున్న ఆధారాలను తనకు నమ్మకం ఉన్న సంస్థల ముందే పెడతానని బండి సంజయ్ లేఖ లో పేర్కొన్నారు. అయితే తనకు ఎలాంటి సిట్ నోటీసులు అందలేదని..సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం మీడియాలో వస్తున్న కథనాల ద్వారానే స్పందించి ఈ లేఖ రాస్తున్నట్లు ఆయన పేర్కొనడం విశేషం.
ఈరోజు బండి సంజయ్ సిట్ ముందు హాజరు కావల్సి ఉండే. ఇక సిట్ అధికారులు నోటీసులు బండి ఇంటికి అంతికించారని చెబుతున్నారు. బండి మాత్రం ఏ ఇంటికి అతికించారో.. తనకు తెలియదని.. తాను ఇంటికి వెళ్లి చూస్తే మాత్రం చిరిగిపోయిన కాగితం గోడకు అతుక్కొని ఉందని అన్నారు. అయితే పార్లమెంట్ సమావేశాలు నడుసున్న నేపథ్యంలో తాను పార్లమెంట్ సభ్యుడిగా వాటికి హాజరు కావల్సి ఉందని.. ఈ కారణంగా ఈ రోజు సిట్ ముందు హాజరు కాలేనని బండి లేఖ ద్వారా వెల్లడించారు.
పార్లమెంట్ సమావేశాలు అయిపోయిన తరువాత తనకు ఓ తేదీ చెబితే.. ఆ రోజు సిట్ ముందు హాజరు అవుతానని అన్నారు. ఇక సిట్ నోటీసుల పేరుతో ప్రతిపక్షాల నోరు మూయడానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని.. మండి పడ్డారు. ఇలాంటి నోటీసులకు భయపడేది లేదన్నారు. పేపర్ లీకేజీ సర్వసాధారణమని ఓ మంత్రి అనడం చాలా దారుణమన్నారు.