హైదరాబాద్ నార్సింగి ఓం కన్వెన్షన్ లో జరిగిన తెలుగు సంగమం సంక్రాంతి సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరోసారి తన మాటలతో చమత్కరించారు. పదవీ విరమణ మాత్రమే చేశా.. పెదవి విరమణ చేయలేదన్నారు.
ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇండియా మోస్ట్ సెక్యులర్ కంట్రీ అని వెంకయ్యనాయుడు అన్నారు. బీబీసీ వాళ్లు మన దేశాన్ని.. ప్రధానిని తక్కువ చేసి ఓ డాక్యుమెంటరీ చేశారని.. అది కేవలం ప్రధానిని మాత్రమే కాదు..దేశాన్ని తక్కువ చేయడమన్నారు. మనం మన భాషను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
మన భాషను కాపాడుకోవడం కోసం ఉద్యమించాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని తెలిపారు. ఇంగ్లీష్ వాళ్లు మన దేశాన్ని దోచుకొని వెళ్లపోయారని..వారి భాష,పద్ధతులు మాత్రం మనం నేర్చుకున్నామన్నారు. కన్నతల్లి.. మాతృభాష, పుట్టిన ఊరు..దేశాన్ని మరిచిన వాడు మనిషే కాదని అన్నారు. మన భాష సంస్కృతులను అలవర్చుకోవడం మన ధర్మమని, మన దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్తుందన్నారు.
మరో పదేళ్లలో మన దేశం ఆర్థిక శక్తిగా మారుతుందని..ప్రపంచంలో ఒకప్పుడు మనది ధనిక దేశమన్నారు. నూతన విద్యావిధానం మాతృభాషను కాపాడుకునే వీలు కల్పించిందని పేర్కొన్నారు. బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి చాలా గొప్పదని… అందులో భాగమే పండుగలు అన్నారు. తెలుగు భాష అమ్మ భాష అన్నారు. తెలుగుని ప్రాచుర్యం చేయాలని.. ఎక్కడికెళ్లినా మాట్లాడాలని అన్నారు. మాతృభాషలో విద్యాభ్యాసాన్ని చేయాలని విద్యావిధానం తీసుకువచ్చిన మోడీకి ధన్యవాదాలు తెలిపారు బండారు దత్తాత్రేయ.