తన భారత్ జోడో యాత్ర నుంచి తాను ఎన్నో నేర్చుకున్నానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ యాత్ర ద్వారా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను కలుసుకోగలిగానన్నారు. కన్యాకుమారి నుంచి జమ్మూ కశ్మీర్ వరకు జోడో యాత్ర చేశానని, ఈ యాత్ర సందర్భంగా వేలాదిమంది ప్రజలు, వివిధ పార్టీల నేతలు తనను కలిశారని ఆయన చెప్పారు. రైతుల సమస్యలు, వారి కష్టాలను అన్నీ విన్నానని, వారి బాధను అర్థం చేసుకున్నానని ఆయన పేర్కొన్నారు.
రాయ్ పూర్ లో జరుగుతున్న పార్టీ 85 వ ప్లీనరీలో మాట్లాడుతూ., కశ్మీర్ లో నా యాత్ర ప్రవేశించినప్పుడు తన ఇంటిని చేరుకున్నట్టు అనుభూతి చెందానని రాహుల్ తెలిపారు. 52 ఏళ్ళు గడిచాయని, కానీ తనకంటూ ఓ ఇల్లు లేదని, కానీ ఈ కేంద్రపాలిత ప్రాంతాన్ని చేరుకోగానే దీన్ని తన ఇంటిలా ఫీలయ్యానన్నారు. దేశంలోని అన్ని కులాలు, మతాలకు చెందిన ప్రజలు తమను వసుధైక కుటుంబ సభ్యులుగా భావించాలన్నదే తన యాత్ర ఉద్దేశమని ఆయన చెప్పారు.
ప్రజలు తనతో ఎలాంటి రాజకీయాల గురించి మాట్లాడలేదని, కానీ తాను కశ్మీర్ చేరుకోగానే యాత్ర స్వరూపమే మారిపోయిందన్నారు. రాజకీయాలన్నవి నిరుద్యోగం, ఆర్ధిక సంబంధ అంశాలఫై ప్రధానంగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆయన బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎన్నికల సందర్బంలో ప్రజలకు సంబంధించని అంశాలను ఆ పార్టీ లేవనెత్తిందని రాహుల్ ఆరోపించారు. నిరుద్యోగ సమస్యను ఎలా పరిష్కరించాలి, జీడీపీని ఎలా బలోపేతం చేయాలి, దేశ ఎకానమీని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలన్నవాటితో రాజకీయాలు ముడిపడి ఉంటాయని, కానీ బీజేపీ తమపైనే దాడులకు దిగిందని ఆయన విమర్శించారు. కానీ మేం బలంగా నిలబడ్డాం అని వ్యాఖ్యానించారు.
1977 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు తాము ఇంటిని ఖాళీ చేయవలసిన పరిస్థితులను ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. ఇక కశ్మీర్ యువత హృదయాల్లో తాము చైతన్యాన్ని మేల్కొలపగలిగామని, జాతీయ పతాకాన్ని మీరు ఎగురవేయాలని, ఈ పతాకాన్ని చేతబట్టి నడవాలని వారిని తాము కోరలేదని, కానీ పెద్ద సంఖ్యలో వారే వచ్చి దాన్ని తమ చేతుల్లోకి తీసుకుని వెళ్లారని రాహుల్ గాంధీ తెలిపారు. .