మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం అధికార నివాసమైన వర్షా ను మాత్రమే తాను వీడానని, తిరుగుబాటుదారులపై పోరాటాన్ని మాత్రం కాదనే విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలని కార్యకర్తలతో ఆయన అన్నారు.
పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో శివసేన భవన్ కు వచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షులను ఉద్దేశించి వర్చువల్ గా ఆయన మాట్లాడుతూ…. సీఎం పదవిపై తనకు ఎలాంటి ఆశా లేదన్నారు. ప్రాణం పోయినా సరే శివసేనను వీడబోమని చెప్పిన నేతలు ఇప్పుడు పారిపోయారని ఆయన విమర్శలు గుప్పించారు.
శివసేనను రెండుగా చీల్చాలని తిరుగుబాటు ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారని మండిపడ్డారు. వారికి ఆ ధైర్యం ఉంటే ఎక్కడా శివసేన పేరు ఎత్తుకుండా ప్రజల్లోకి వెళ్లి ఆ పని చేయాలని సవాల్ విసిరారు. ఓ సమయంలో శివాజీ మహారాజ్ ఓడిపోయినప్పటికీ ప్రజలు ఆయన వెన్నంటే ఉన్నారని గుర్తు చేశారు. పార్టీ పునర్నిర్మాణం చేస్తామని చెప్పారు.
తనకు ఆరోగ్యం సహకరించడంలేదని,అందుకే తాను ఇటీవల కొన్ని పనులను సరిగా చేయలేకపోతున్నానని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. మెడ, తల నొప్పితో పాటు కళ్లు కూడా తెరువలేకపోతున్నానని చెప్పుకొచ్చారు. షిండే కోసం తాను ఎన్నో చేశానని అన్నారు. చివరికి షిండే కుమారుడు ఎంపీ అయ్యేందుకు కూడా చాలా సహాయం చేశానన్నారు. అలాంటి తనపై షిండే ఆరోపణలు చేయడం బాధను కలిగించిందన్నారు.