ప్రస్తుతం కొత్తగా విడుదలవుతున్న ఐఫోన్లలో టచ్ ఐడీ సెన్సార్‌ను ఇవ్వడం లేదు. కేవలం ఫేస్ ఐడీనే ఇస్తున్నారు. ఇందులో భాగంగానే ఐఫోన్ ముందు భాగంలో ఉండే కెమెరాతోపాటు పలు సెన్సార్లు యూజర్ ముఖాన్ని 3డిలో స్కాన్ చేస్తాయి. అనంతరం ముఖాన్ని పాస్‌వర్డ్‌గా భద్ర పరుస్తాయి. ఈ క్రమంలో ఫోన్ ఎదుట యూజర్ ముఖాన్ని ఉంచితే ఫోన్ ఆటోమేటిగ్గా అన్‌లాక్ అవుతుంది. అయితే ముఖానికి మాస్క్ ఉన్నా కేవలం కళ్లతోనే అయినా సరే ఫేస్ ఐడీ పనిచేస్తుంది. కానీ దీన్ని ఎవరూ చీట్ చేయలేకపోయారు. వ్యక్తికి చెందిన ఫొటోను ఉంచి, కవలలను పెట్టి.. ఇలా అనేక రకాలుగా ఫేస్ ఐడీని చీట్ చేద్దామని కొందరు యత్నించారు. కానీ ఎవరూ విజయవంతం కాలేదు. అలా పకడ్బందీగా యాపిల్ ఫేస్ ఐడీని అందుబాటులోకి తెచ్చింది.
అయితే పాత ఐఫోన్లలో ఫేస్ ఐడీకి బదులుగా టచ్ ఐడీ లభిస్తోంది. కానీ నిజానికి దీన్ని కూడా చీట్ చేయడం సాధ్యం కాదు. అంటే.. ఉదాహరణకు టచ్ ఐడీ సెన్సార్ ఉన్న ఏదైనా ఐఫోన్‌ను ఎవరైనా వాడుతున్నారనుకుంటే.. ఆ వ్యక్తి చనిపోతే అతని చేతివేళ్లతో సదరు ఐఫోన్‌ను అన్‌లాక్ చేయలేరు. చనిపోయిన వ్యక్తి వేళ్లను టచ్ ఐడీ సెన్సార్‌పై ఉంచితే పనిచేయదు. అవును, నిజమే. కొందరు ఇలా ప్రయత్నించి చూశారు కానీ విఫలం అయ్యారు.
అయితే చనిపోయిన వ్యక్తి వేళ్లతో ఐఫోన్‌లోని టచ్ ఐడీ సెన్సార్‌ను పనిచేయించాలంటే ఆ వ్యక్తి శరీరంలోకి కరెంటును ప్రవహింపజేయాల్సి ఉంటుంది. అలాగే గోరు వెచ్చగా ఉండే సెలైన్‌ను పంపించాలి. దీంతో ఆ వ్యక్తి చేతి వేళ్ల ద్వారా ఐఫోన్‌లోని టచ్ ఐడీ సెన్సార్‌ను ఉపయోగించి ఫోన్‌ను అన్‌లాక్ చేసేందుకు వీలుంటుందని పలువురు తెలిపారు. అయినప్పటికీ ఇవేవీ రుజువు కాలేదు.
అసలు ఇలా టచ్ ఐడీ సెన్సార్‌కు కూడా ఇంత సెక్యూరిటీ ఎందుకు ఉంటుంది ? అంటే.. టచ్ ఐడీ సెన్సార్ చుట్టూ ఒక కెపాసిటివ్ రింగ్ ఉంటుంది. అది మెటల్ (లోహం) తరహాలో టచ్ ఐడీ చుట్టూ మనకు కనిపిస్తుంది. అది మన చేతి వేళ్లను గుర్తించి ఆ సమాచారాన్ని దాని మధ్యలో ఉండే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌కు చేరవేస్తుంది. ఈ క్రమంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మన చేతి వేళ్లను గుర్తు పట్టి ఆ ముద్రల ఆధారంగా పూర్తిగా సెక్యూర్ పద్ధతిలో ఫోన్‌ను అన్‌లాక్ చేస్తుంది. ఈ విధంగా టచ్ ఐడీ సెన్సార్ పనిచేస్తుంది.
అయితే సదరు కెపాసిటివ్ రింగ్ బతికి ఉన్న వారి, చనిపోయిన వారి వేళ్లను సులభంగా గుర్తించగలుగుతుంది. అందుకనే చనిపోయిన వారి చేతి వేళ్లతో టచ్ ఐడీ ద్వారా ఐఫోన్లను అన్‌లాక్ చేయలేము. అలాంటి పకడ్బందీ సెక్యూరిటీని కల్పిస్తాయి కనుకనే ఐఫోన్లు అంతగా పేరుగాంచాయి.