ముంబైలోని తాజ్ హోటల్ పై 2008 నవంబరు 26 న జరిగిన ఉగ్రదాడి నుంచి తానెలా తప్పించుకున్నానో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఇన్నేళ్లకు వివరించారు. ఆ రోజున ఆ హోటల్ లో దుబాయ్ నుంచి వచ్చిన తన స్నేహితులతో బిజినెస్ మీటింగ్ జరుపుతుండగా టెర్రరిస్టులు హోటల్ లోకి ప్రవేశించారని.. మొదటిసారిగా కాల్పులు జరపడం చూశానని ఆయన తెలిపారు. ఫ్రెండ్స్ తో సమావేశం తరువాత హోటల్ నుంచి బయటకు రాబోతుండగా తన మిత్రుల్లో కొందరు మళ్ళీ ఓ మీటింగ్ నిర్వహిద్దామని చెప్పడంతో అక్కడే ఉండిపోయానని ఆయన చెప్పారు.
‘హోటల్ పై టెర్రరిస్టుల దాడి జరుగుతున్నట్టు తెలిసింది.. కొద్దిసేపటికే నన్ను హోటల్ సిబ్బంది హోటల్ వెనుక వైపు నుంచి కిచెన్ లోకి తీసుకుపోయారు.. చాలాసేపు అక్కడే ఉండిపోయా.. ఆ మరుసటిరోజు.. నవంబరు 27 ఉదయం ఏడున్నరగంటల ప్రాంతంలో కమెండోలు నన్ను సురక్షితంగా బయటకు తీసుకువెళ్లారు’ అని అదానీ నాటి భయంకర ఘటన గురించి తెలిపారు. తన ఫ్రెండ్స్ తో మళ్ళీ తాను సమావేశానికి కూర్చోకపోతే ఉగ్రవాదుల కాల్పులకు బలై ఉండేవాడినని అన్నారు.
బహుశా హోటల్ బాల్కనీలో పచార్లు చేస్తూ ఉండేవాడినని, ఆ ప్రదేశాన్ని ఉగ్రవాదులు టార్గెట్ గా పెట్టుకుని కాల్పులు జరిపిన ఘటన ఇప్పటికీ గుర్తుందని అదానీ చెప్పారు. ముంబైలో ఆ నాడు జరిగిన ఉగ్రదాడులు ఈ నాటికీ దేశ ప్రజలను, ముఖ్యంగా ముంబైవాసులను భయకంపితులను చేస్తూనే ఉన్నాయి.
పాకిస్థాన్ కు చెందిన లష్కరే తోయిబా వంటి సంస్థల టెర్రరిస్టులు నగరంలోని తాజ్ హోటల్ తో బాటు కొన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన కాల్పుల్లో 166 మంది మరణించగా ..సుమారు 300 మందికి పైగా గాయపడ్డారు. ఛత్రపతి శివాజీ టర్మినస్, లియోపోల్డ్ కేఫ్, నారిమన్ హౌస్, ఒబెరాయ్ ట్రిడెంట్ వంటి ప్రముఖ హోటళ్లు, ఇతర ప్రదేశాలపై వారు విరుచుకు పడ్డారు.