నేషనల్ స్టాక్ ఎక్చేంజీ (ఎన్ ఎస్ఈ) మాజీ ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. పన్ను ఎగవేత కేసు, ఎన్ఎస్ఈలో జరిగిన అవకతవకలకు సంబంధించిన కేసుల్లో విచారణలో భాగంగా ఈ దాడులు నిర్వహించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఆమె ఎండీగా ఉన్న సమయంలో ఎన్ఎస్ఈకి ఆపరేటింగ్ అధికారిగా, ఎండీకి సలహాదారుడిగా ఆనంద్ సుబ్రహ్మణ్యంను ఆమె నియమించారు. హిమాలయాల్లోని ఓ యోగి సలహా మేరకే ఆయనను ఈ పదవిలో ఆమె నియమించారని సెబీ ఇటీవల ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఎన్ఎస్ఈకి సంబంధించి ఆర్థిక, వ్యాపార ప్రణాళికలకు సంబంధించి అంతర్గత రహస్య సమాచారాన్ని ఆ హిమాలయ యోగికి ఆమె చేరవేశారని సెబీ చెప్పింది. ఎక్చేంజ్ ఉద్యోగుల పనితీరు అంచనాలపై ఆ యోగీని ఆమె సంప్రదించారని తెలిపింది.
‘ఎన్ఎస్ఈకి సంబంధించిన ఆర్థిక, వ్యాపార ప్రణాళికల గురించి విషయాలను ఇతరులతో పంచుకోవడం సరికాదు. ఇలాంటి చర్యలు స్టాక్ ఎక్చేంజీల పునాదులను కదిలించే అవకాశాలు ఉన్నాయి” అని సెబీ పేర్కొంది. అనంతరం ఆమెకు సెబీ జరిమానాను విధించిది. సెబీ వ్యాఖ్యల నేపథ్యంలో మరోసారి ఐటీ దాడులు జరగడం గమనార్హం.