శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన చిత్రం ఇష్క్. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి నేటికి సరిగ్గా 10వ సంవత్సరాలు అవుతుంది. 2012లో ఇదే రోజున విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. నితిన్ కెరీర్ లో ఇది ఓ మర్చిపోలేని సినిమా.
అయితే ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 24 నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన తేదీ. 10 ఏళ్ల క్రితం ఇదే తేదీన ఇష్క్ సినిమా విడుదలైంది. ఇది చాలా మరపురాని చిత్రం. నటుడిగా నాకు పునర్జన్మ లాంటిది.
ఇష్క్ విజయానికి నాలుగు కారణాలున్నాయి. ఒకటి విక్రమ్ కుమార్ కథ, దర్శకత్వం. రెండవది పిసి శ్రీరామ్ మ్యాజికల్ ఫ్రేమ్‌లు, అద్భుతమైన విజువల్స్. ఇక అనూప్, అరవింద్-శంకర్‌ల సంగీతం మూడో కారణం కాగా, నిత్యామీనన్‌తో నా కెమిస్ట్రీ నాల్గవది. మళ్లీ ఈ డ్రీమ్ టీమ్‌తో కలిసి పనిచేయాలనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక నిత్యా మీనన్ మాట్లాడుతూ ఇష్క్ నా రెండో తెలుగు సినిమా. ఇది నా మనసుకు చాలా దగ్గరైంది. ఇప్పటికీ చాలా మంది ప్రియా ప్రియా పాట పాడమని అడుగుతుంటారని చెప్పుకొచ్చింది
అలాగే విక్రమ్ కె కుమార్ మాట్లాడుతూ ఇష్క్ ప్రధానంగా మూడు కారణాల వల్ల గుర్తుండిపోతుంది. నితిన్-నిత్యా మీనన్ కెమిస్ట్రీ, పిసి సర్ విజువల్స్, అనూప్ సంగీతం. ఇష్క్ నా కెరీర్‌లో టర్నింగ్ పాయింట్. ప్రాజెక్ట్‌పై నాపై నమ్మకం ఉంచిన నితిన్, సుధాకర్‌రెడ్డికి ధన్యవాదాలు. ఇది నా జీవితాన్ని మార్చివేసిందంటూ చెప్పుకొచ్చారు విక్రమ్ కె కుమార్.