మునుగోడుని నేనే దత్తత తీసుకుంటా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ పత్రం దాఖలు సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఈ ఉప ఎన్నికల్లో గెలిపిస్తే.. మునుగోడును తానే స్వయంగా దత్తత తీసుకుంటా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్.
నా మాట మీద నమ్మకం ఉంచండంటూ కేటీఆర్ అన్నారు. నవంబర్ 6 తర్వాత ప్రతి మూడు నెలలకోసారి వచ్చి అభివృద్ధి పనులను పర్యావేక్షిస్తానన్నారు. అభివృద్ధిలో అండగా ఉంటానన్నారు. రోడ్లను అభివృద్ధి చేస్తానన్నారు. మునుగోడుని అభివృద్ధిలో ముందంజలో ఉంచేందుకు కృషి చేద్దామని పేర్కొన్నారు కేటీఆర్.
సిరిసిల్లను ఎంత బాగా చూసుకుంటున్నానో మునుగోడును కూడా అంతే బాగా చూసుకుంటానన్నారు. కుసుకుంట్లను ఓ తమ్ముడిగా అభివృద్ధిలో సహకరించడానికి తాను బాధ్యత తీసుకుంటానని తెలిపారు. ఎలక్షన్లకు ముందు ఓ మాట.. తర్వాత మరో మాట చెప్పనని పేర్కొన్నారు కేటీఆర్.
నాలుగేళ్లుగా రాజగోపాల్ రెడ్డి పట్టించుకోని మునుగోడు బాధను తీర్చేందుకు తాను బాధ్యతను తీసుకుంటానని వెల్లడించారు. రాజగోపాల్ రెడ్డి డబ్బులు పంచి గెలవాలని చూస్తున్నాడని ఆరోపణలు చేశారు. ఇది మునుగోడు ప్రజల ఆత్మ గౌరవానికి.. రాజగోపాల్ రెడ్డి డబ్బు మదానికి జరుగుతున్న ఎన్నిక అని వ్యాఖ్యానించారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.