కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై అనర్హత వేటుతో పాటు 8 ఏళ్ల పాటు ఎన్నికలకు దూరంగా ఉండాలన్న లోక్ సభ సచివాలయం ప్రకటన దుమారాన్ని రేపుతోంది. దీని పై ఆ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు.
రాహుల్ గాంధీ విషయంలో దేశంలో కోర్టులు చాలా స్పీడ్ గా స్పందించాయని ఇన్ డైరెక్ట్ గా విమర్శించారు. తాను కూడా ప్రధాని మోదీ పై పరువు నష్టం దావా వేయబోతున్నానని మరి.. ఈ కేసు విషయంలో న్యాయస్థానాలు ఎంత వేగంగా స్పందిస్తాయో చూడాలని ఎద్దేవా చేశారు.
రాహుల్ విషయంలో స్పందించినట్లుగా స్పందించి త్వరగా విచారణ పూర్తి చేసి తీర్పును వెలువరిస్తాయో లేదో చూడాలని చెప్పారు. ఇక 2018 లో పార్లమెంట్ లో ప్రధాని ప్రసంగిస్తుండగా ఓ విషయంపై తాను నవ్వానని అప్పుడు మోదీ నిండు సభలోనే తన నవ్వును శూర్పణఖ నవ్వుతో పోల్చారని రేణుకా చౌదరి అన్నారు.
అయితే 2019 లో కర్ణాటకలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మోదీ అనే పేరున్న వాళ్లంతా దొంగలేననే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్ కు చెందిన బీజేపీ నేత పరువునష్టం దావా వేశారు. తాజాగా ఈ కేసులో తీర్పు వెలువరించిన న్యాయస్థానం రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.