- అందరూ నన్నే కావాలనుకుంటున్నారు.. తిరిగి పోటీకి రెడీ !
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ వైట్ హౌస్ వైపు ఆశగా చూస్తున్నారు. తిరిగి అధికార పగ్గాలను చేబట్టాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఈ మధ్య ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని చెప్పారు. 2024 లో అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికలో తాను పోటీ చేస్తానని ప్రకటించారు. పాపులారిటి పోల్ లో నేనే ముందంజలో ఉన్నానని, ప్రతి వ్యక్తీ తననే కోరుకుంటున్నాడని ఆయన అన్నారు. పార్టీలో గానీ, రిపబ్లికన్లు లేదా ప్రత్యర్థి డెమొక్రాట్లలో గానియ్యండి.. అంతా నేను మళ్ళీ అధ్యక్షుడ్ని కావాలనుకుంటున్నారు.. సమీప భవిష్యత్తులో నా నిర్ణయాన్ని ప్రకటిస్తా అని ఆయన చెప్పారు. ఆ నిర్ణయంతో ఒకరిద్దరు అసంతృప్తి వ్యక్తపరుస్తారేమో గానీ, చాలామంది మాత్రం హ్యాపీ ఫీలవుతారు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. 2016 నుంచి నాలుగేళ్ల పాటు అమెరికా అధ్యక్షునిగా వ్యవహరించిన ఆయన.. 2020 లో డెమొక్రాట్ జోబైడెన్ చేతిలో ఓడిపోయారు. కానీ తన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. తన ఓటమిని సవాలు చేస్తూ కోర్టుకు కూడా ఎక్కారు.
ఇండో-అమెరికన్ బిజినెస్ మన్ శలభ్ కుమార్ విషయం కూడా ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావనకు వచ్చింది. ఈయన ట్రంప్ కు సన్నిహితుడే కాక.. క్యాంపెయిన్ డోనర్ కూడా.. 2024 లో జరిగే ఎన్నికల్లోనూ ఈయన ట్రంప్ తరఫున ప్రచారం చేయవచ్చు. తాము ఎప్పటినుంచో స్నేహితులమని, 2016 లోను, 2020 లో కూడా కుమార్ తన తరఫున ప్రచారం చేశారని ట్రంప్ తెలిపారు.
ఇక ఇండియాతో తనకెంతో అనుబంధం ఉందని, ప్రధాని మోడీ తనకు మంచి మిత్రుడని అన్నారు. ‘ఆయన (మోడీ) టెరిఫిక్ జాబ్ చేస్తున్నారు.. ఆయన చేస్తున్న విధి నిర్వహణ చాలా జటిలమైనది’.. చాలాకాలంగా మాకు స్నేహం ఉంది’ అని పేర్కొన్నారు. 2020లో అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికకు కొన్ని నెలల ముందు ..2019 లో మోడీ.. ‘హౌడీ మోడీ’ పేరిట గుజరాత్ లో పెద్ద ఈవెంట్ ని నిర్వహించారు. ఆ సందర్భంగా ట్రంప్ కి ఆ రాష్ట్రంలో భారీ స్వాగతం లభించింది.
ఈ ఇంటర్వ్యూలో ట్రంప్ వెంటే ఉన్న శలభ్ కుమార్.. అమెరికాలో 2024 లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ అభ్యర్థిగా పోటీ చేస్తారని చెప్పారు. అమెరికా 47 వ ప్రెసిడెంట్ గా ట్రంప్ కావాలని ప్రజల్లో చాలామంది కోరుకుంటున్నారని, తమ వర్గమంతా ట్రంప్ ని తిరిగి ఈ పదవిలో చూడాలనుకుంటున్నదని ఆయన తెలిపారు.