హర్యానాలో ఓ ఐఏఎస్ అధికారి.. సమాజంలో వేళ్లూనుకుపోయిన అవినీతిపై యుద్ధం చేస్తానని ప్రమాణం చేస్తున్నారు. అశోక్ ఖేమ్కా అనే ఈ అధికారి తనను రాష్ట్ర విజిలెన్స్ శాఖ హెడ్ గా నియమించాలని కోరుతూ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు ఇటీవల లేఖ రాశారు. రోజులో తాను కేవలం 8 నిముషాలు మాత్రమే పని చేస్తానని, కానీ ఇందుకు తనకు ఏడాదికి రూ. 40 లక్షల వేతనం వస్తోందని ఆయన తెలిపారు. అయితే వివిధ శాఖల్లో కొందరు అధికారులు మాత్రం నిరంతరం శ్రమకోర్చి పని చేస్తున్నారన్నారు.
ప్రస్తుతం ఈయన ఆర్కీవ్స్ డిపార్ట్మెంట్ లో అదనపు చీఫ్ సెక్రటరీగా పని చేస్తున్నారు. తన 30 ఏళ్ళ కెరీర్ లో అత్యంత నిజాయితీ గల ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న అశోక్ ఖేమ్కా .. 50 కి పైగా వివిధ పదవుల్లో పని చేశారు. ఎన్నోసార్లు బదిలీ అవుతూ వచ్చారు. తరచూ బదిలీలు, వివాదాలు ఈయన కెరీర్లో చోటు చేసుకున్నాయి. ఈ నెల 23 న సీఎంకి రాసిన లేఖలో ఈయన. తనకు ప్రస్తుత హోదాలో పని లేకుండా పోతోందని, కానీ అనేక శాఖల్లో కొంతమంది అధికారులు గొడ్డు చాకిరీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతి రాజ్యమేలుతోందని, దీన్ని అంతమొందించాలని నిశ్చయించుకున్నానని తెలిపారు. 1991 బ్యాచ్ హర్యానా కేడర్ కి చెందిన ఆయన.. 2012 లో పతాక శీర్షికలకెక్కారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా కు సంబంధించి గురుగ్రామ్ లోని వివాదాస్పద భూమి డీల్ మ్యుటేషన్ ని ఆయన అప్పట్లో రద్దు చేశారు.
ఇది కొంత భూమికి సంబంధించిన యాజమాన్య హక్కును వాద్రాకు బదిలీ చేయడానికి ఉద్దేశించిన డీల్. అప్పటి నుంచే ఈయనకు బదిలీల పర్వం మొదలైంది. ఈ ఆర్కీవ్స్ శాఖలో తనకు వారానికి ఒక గంట మించి పని ఉండదని, కానీ సాలుకు 40 లక్షల వేతనం తనకు లభిస్తోందని అశోక్ పేర్కొన్నారు. తనకు అవకాశమిస్తే అవినీతిని నిర్మూలించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తానని, మొదట ఇందుకు విజిలెన్స్ శాఖ నుంచే శ్రీకారం చుడతానని ఆయన అన్నారు.