తమను రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ కొందరు రెజ్లర్లు చేసిన ఆరోపణను ఆయన తీవ్రంగా ఖండించారు. అదే నిజమైతే తాను ఉరేసుకుంటానని అన్నారు. బీజేపీ నేత కూడా ఈయన.. తమను కొడుతున్నాడని, మహిళా రెజ్లర్ల పట్ల అనుచితంగా..అసభ్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ ఒలంపియన్ రెజ్లర్లు పలువురు బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ఈ సంస్థ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, నిరంకుశ చట్టాలను రుద్దుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బజ్ రంగ్ పునియా, సాక్షి మాలిక్, సంగీతా ఫొగత్, సోనమ్ మాలిక్ వంటివారు వీరికి సంఘీభావం ప్రకటించారు. అథ్లెట్లు ఈ దేశం కోసం పతకాలు సాధించేందుకు శ్రమిస్తారని, కానీ ఈ ఫెడరేషన్ మాత్రం చేసింది ఏమీ లేదని సాక్షి మాలిక్ పేర్కొన్నారు. నిరంకుశ చట్టాలతో ప్లేయర్లను వేధిస్తున్నారన్నారు. జంతర్ మంతర్ వద్ద ప్రొటెస్ట్ చేసినవారిలో ఒకరైన రెజ్లర్ వినేష్ ఫొగత్ ..మహిళా అథ్లెట్లను కోచ్ లు తీవ్రంగా వేధించడం పరిపాటి అయిందని, ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ అనేకమంది అమ్మాయిలను లైంగికంగా వేధించాడని ఆరోపించింది.
తమ వ్యక్తిగత జీవితాల్లో ఇలాంటివారు జోక్యం చేసుకుంటున్నారని తెలిపిన ఆమె.. బ్రిజ్ భూషణ్ కారణంగా ఒకసారి తాను సూసైడ్ చేసుకోవాలనుకున్నానని తీవ్ర భావోద్వేగానికి గురయింది.. ఆయనపై ఫిర్యాదు చేసినందుకు లోగడ తనను చంపేస్తామంటూ బెదిరింపులు అందాయని ఆమె తెలిపింది. అతడిని అధ్యక్ష పదవి నుంచి తొలగించేవరకు తాము ధర్నా కొనసాగిస్తామని రెజ్లర్లు ప్రకటించారు.
అయితే వీరి ఆరోపణలను ఖండించిన బ్రిజ్ భూషణ్.. వీటిని నిరూపిస్తే ఉరేసుకుంటానని, ఇదంతా తనపై కుట్ర అని అన్నారు. ఇందులో ఓ బడా పారిశ్రామికవేత్త హస్తం ఉందన్నారు. వినేష్ ఫోగట్ ఓడిపోయినప్పుడు తాను ఓదార్చానని తెలిపారు. తన పదవికి రాజీనామా చేయబోనన్నారు. క్యాంప్ నుంచి తన ఇల్లు 120 కి.మీ. దూరంలో ఉంటుందని, తనకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉందని చెప్పిన ఆయన.. లైంగిక వేధింపులు అన్న ప్రసక్తే లేదన్నారు.