పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదంపై దేశాలన్నీ ఐక్యంగా ఉండి పోరాటం చేయాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్ తన ఇంటిని తాను సరిదిద్దు కోవాల్సిన అవసరం ఉందన్నారు. 2010 నుంచి 2017 వరకు పాక్ లో జరిగిన ఉగ్రదాడుల గురించి ఈ సందర్బంగా ఆయన ప్రస్తావించారు.
ఆ ఏడేండ్ల కాలంలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ హయాంలో ప్రారంభమైన ఉగ్రదాడులకు పాక్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ తమ గత ప్రభుత్వ హయాంలో ముగింపు పలికిందని పేర్కొన్నారు. ఉగవాదాన్ని తుదముట్టించే అంశంపై ఇదే నేషనల్ అసెంబ్లీలో చాలాసార్లు చర్చలు జరిగాయని వెల్లడించారు.
కానీ ఉగ్రవాదాన్ని మట్టుపెట్టే విషయంలో ఓ అంతిమ నిర్ణయానికి రాలేకపోయామని తెలిపారు. ఈ విషయంలో వీలైనంత త్వరగా ఓ నిర్ణయానికి రావాలన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి జనం భారీగా వలసలు వచ్చి పాకిస్థాన్‌లో నివాసం ఉంటున్నారని ఆయన అన్నారు.
ఈ క్రమంలో పాకిస్థాన్‌లో భారీగా నిరుద్యోగం పెరిగిపోతోందన్నారు . ఉపాధి లేక యువత ఉగ్రవాదం వైపు మొగ్గుచూపుతున్నదని అభిప్రాయపడ్డారు. ఈ సమస్యకు కూడా పరిష్కారం మార్గం చూడాల్సిన అవసరం ఉందన్నారు. ‘నేను ఎక్కువ మాట్లాడను కానీ, ఒక్క మాటలో చెప్పాలంటే మొదట ఉగ్రవాదానికి బీజం వేసింది మనమే’అని పేర్కొన్నారు.