ఇక తాను విశాఖవాసినైపోతానని,ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ ఓ ఉద్వేగానికి గురవుతానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఎప్పటినుంచో వైజాగ్ లో నివాసం ఉండాలని అనుకుంటూ వచ్చానని, ఆ కల త్వరలో నెరవేరనుందని చెప్పారు. తన ‘వాల్తేరు వీరయ్య’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం ఇక్కడ నిర్వహించిన సందర్భంగా మాట్లాడిన ఆయన.. భీమిలి బీచ్ రోడ్డులో స్థలం కొన్నానని, త్వరలో అక్కడ ఇల్లు నిర్మించుకుని సెటిల్ అవుతానని ప్రకటించారు.
రిటైర్మెంట్ తరువాత హాయిగా ఈ నగరంలో ఎవరైనా గడపవచ్చునన్నారు. ఇది అద్భుతమైన నగరమని, ఇక్కడి ప్రజలన్నా వారి మనస్తత్వం అన్నా ఇష్టమన్నారు. దీన్ని స్వర్గధామంగా అభివర్ణించారు. ఇక్కడి కాస్మోపాలిటన్ కల్చర్ అంటే తనకెంతో మక్కువ అన్నారు. నేనూ ఇక్కడి పౌరుడినైతే అంతకన్నా ఆనందం తనకు మరొకటి లేదన్నారు.
ఇన్నాళ్లూ మాట మాత్రమే అన్నానని, ఇక దీన్ని కార్య రూపంలోకి తేవలసి ఉందన్నారు. ఇక్కడి సీ షోర్ తనకు ఎంతో నచ్చిందని చిరంజీవి చెప్పారు. నిజానికి విశాఖలో ఆయన స్టూడియో నిర్మించాలనుకుంటున్నారని లోగడ వార్తలు వచ్చాయి. అయితే యేవో కారణాల దృష్ట్యా అది జరగలేదు.
గతంలో చిరంజీవి ఆధ్వర్యాన తెలుగు సినీ నటీనటులు .. సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలపైన, ముఖ్యంగా సినిమా టికెట్ల వివాదాస్పద ధరలపైనా చర్చించేందుకు ఏపీ సీఎం జగన్ తో భేటీ అయినప్పుడు.. ఆయన.. విశాఖను మీ కొత్తగా ‘ఇంటి’గా చేసుకోండని, ఇక్కడే తెలుగు సినీ పరిశ్రమ స్థిరపడాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించిన విషయం గమనార్హం.