బడ్జెట్ అంటేనే ముఖ్యంగా మధ్యతరగతి వర్గాల్లో ‘బాంబు’ పేలినంత భయం ! రాయితీల తాయిలాల మాట అటుంచి ఏ వస్తువుల ధరలు పెరుగుతాయో, పన్నుల బాదుడు ఎలా ఉంటుందో.. ఆదాయపు పన్ను చెల్లింపు మినహాయింపుల వరాలు అసలు ఉంటుందో.. ఉండదో.. ఇలా ఎన్నో భయాలు సర్వ సాధారణం.. చూస్తుండగానే బడ్జెట్ సీజన్ వచ్చేస్తోంది. ఫిబ్రవరి 1 న పార్లమెంటుకు ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2023-2024 సంవత్సరానికి బడ్జెట్ ను సమర్పించనున్నారు.
ఈ నేపథ్యంలో ఆదివారం ఆర్ఎస్ఎస్ వీక్లీ మ్యాగజైన్ ‘పాంచజన్య’ నిర్వహించిన కార్యక్రమంలో.పాల్గొన్న ఆమె . ఎప్పుడూ చేయని వ్యాఖ్యలు చేశారు. తానూ మధ్యతరగతికి చెందిన మహిళనేనని, వారి కష్టాలు తనకు తెలుసునని అన్నారు. ‘ఐ ఐడెంటిఫై మైసెల్ఫ్ విత్ ది మిడిల్ క్లాస్..సో ఐ నో’ అన్నారామె.
మధ్యతరగతి వర్గాలపై ప్రభుత్వం కొత్తగా పన్నులు వేయలేదని, ఆదాయపు పన్ను నుంచి రూ. 5 లక్షల వరకు మినహాయింపు ఉందని గుర్తు చేశారు. మిడిల్ క్లాస్ వారి సమస్యలేమిటో తాను అర్థం చేసుకున్నానని, వారి ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఎంతో చేస్తోందని నిర్మలా సీతారామన్ అన్నారు.
2020 నుంచి ప్రతి బడ్జెట్లో సర్కార్ మూలధన వ్యయంపై కేటాయింపులను పెంచుతోందని, వర్తమాన ఆర్థిక సంవత్సరానికి రూ. 7.5 లక్షల కోట్లకు.. అంటే 35 శాతం పెంచడం జరిగిందని ఆమె తెలిపారు. ఎకానమీ పై దీని ప్రభావాలు చాలా ఉంటాయన్నారు. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 6 వరకు ఇవి సాగుతాయి. మధ్యంతర విరామంతో బాటు 66 రోజుల పాటు 27 సెషన్స్ ఉంటాయని సంబంధిత వర్గాలు ఇదివరకే తెలిపాయి.