లిక్కర్ స్కామ్ లో తనపై వచ్చిన ఆరోపణలన్నీ తప్పుడువని ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మళ్ళీ స్పష్టం చేశారు. ఎనిమిదేళ్లుగా నిరంతరాయంగా నీతి, నిజాయితీగా, నిబధ్ధతతో ప్రజాసేవ చేసినప్పటికీ తనపై అవినీతి ఆరోపణలు రావడం దురదృష్టకరమని ఆయన సీఎం కేజ్రీవాల్ కు పంపిన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
‘అరవింద్ కేజ్రీవాల్ స్వచ్ఛమైన రాజకీయాలకు భయపడిన కొన్ని పిరికి శక్తుల కుట్ర ఫలితంగానే నా మీద అభియోగాలు మోపారు.. అసలు వారి టార్గెట్ నేను కాదు.. మీరు’ అని ఆయన కేజ్రీవాల్ ను ఉద్దేశించి పేర్కొన్నారు. ఈ దేశానికి విజన్ ఉన్న నేత మీరేనని ఈ దేశ ప్రజలంతా మిమ్మల్ని భావిస్తున్నారని, తమ జీవితాల్లో మార్పులు వస్తాయని, అందుకు మీరే సమర్ధులని కోట్లాదిమంది మీపై ఆశలు పెట్టుకున్నారని ఆయన అన్నారు.
ఆర్ధిక సంక్షోభం, పేదరికం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి అనేక సమస్యలనెదుర్కొంటున్న కోట్లాది ప్రజలకు మీరు ఆశా కిరణమయ్యారని, ఈ సమస్యలను మీరు తీర్చగలరని భావిస్తున్నారని మనీష్ సిసోడియా అన్నారు.
5 నుంచి ఇంటింటి ప్రచారం
సిసోడియా, సత్యేంద్ర జైన్ లను సిబిఐ అరెస్టు చేసినందుకు నిరసనగా ఆప్ నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలంతా ఈ నెల 5 నుంచి ఇంటింటి ప్రచారం నిర్వహించాలని, కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. బుధవారం తన నివాసంలో వీరితో భేటీ అయిన ఆయన.. సిసోడియా, జైన్ రాజీనామాల వెనుక ఉన్న ‘కారణాలను’ ప్రజలకు వివరించాలని ఆదేశించారు.తమ ప్రభుత్వం చేబట్టిన ఆరోగ్యం, విద్యా విధాన మోడల్స్ విజయవంతం కావడంతో బీజేపీ నేతృత్వం లోని కేంద్రం అసూయ చెందిందని, అందువల్లే సిసోడియాను, జైన్ ను జైలుకు పంపిందని ఆయన ఆరోపించారు.