కర్ణాటకలో ఇద్దరు మహిళా అధికారుల మధ్య వార్ నడుస్తోంది. మహిళ ఐఏఎస్, ఐపీఎస్ మధ్య సోషల్ మీడియాలో ఫైట్ జరుగుతోంది. రాష్ట్ర హస్తకళల అభివృద్ది కార్పొరేష్ ఎండీ రూపా మౌద్గిల్(ఐపీఎస్), దేవాదాయ శాఖ కమిషనర్ రోహిణి సింధూరి(ఐఏఎస్) బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు.
మహిళా అధికారుల ఘర్షణపై రాష్ట్ర హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటన మంచివి కావన్నారు. మహిళా అధికారుల తీరును ఆయన తప్పుబట్టారు. వారిద్దరూ నిబంధనలు ఉల్లంఘించారని ఆయన మండిపడ్డారు. వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ప్రజల్లో ఐఏఎస్, ఐపీఎస్ లు అంటే గౌరవం ఉంటుందన్నారు. కానీ వారిద్దరూ చేసిన పని సివిల్ సర్వీసెస్ అధికారులందరికీ అగౌరవంగాను, అప్రతిష్ఠ తెచ్చేదిగాను ఉందని ఆయన అన్నారు. ఈ ఘటనపై తాము మౌనంగా ఉండబోమన్నారు.
అసలేం జరిగిందంటే… ఐఏఎస్ సింధూరికి చెందిన కొన్ని ఫోటోలను ఐపీఎస్ రూప తన ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. తన ఫోటోలను ముగ్గురు పురుష ఐఏఎస్ అధికారులకు ఐఏఎస్ రోహిణి పంపించి సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆమె ఆరోపణలు చేశారు. రోహిణిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వాటిపై సీఎం బసవరాజ్ బొమ్మైకు, సీఎస్ వందితా శర్మకు ఫిర్యాదు చేసినట్లు రూప పేర్కొన్నారు.
దీనిపై ఐఏఎస్ సిందూరి సీరియస్ అయ్యారు. తనపై ఐపీఎస్ రూప వ్యక్తిగతంగా, అసత్య ప్రచారాలు చేస్తోందని ఆమె వెల్లడించారు. ఐపీఎస్ రూప మానసిక సమస్యలతో బాధపడుతున్నారని, ఆమె తనను అప్రతిష్ఠపాలు చేసేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారంటూ ఆమె వ్యాఖ్యానించారు.