ఐఏఎస్ రోహిణి సింధూరి, ఐపీఎస్ రూప మౌద్గిల్ మధ్య కోల్డ్ వార్ ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు. వారిపై నిన్ననే ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. దీంతో అంతా సైలెంట్ అయిపోతారని అనుకున్నారు. కానీ వాళ్లు ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా ఈ రోజు ఐపీఎస్ రూప మౌద్గిల్ ఆడియో రికార్డు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బదిలీ సమయంలో వారికి ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది. మీడియాలో ఎలాంటి ప్రకటనలు చేయవద్దని వారిద్దరిని ప్రభుత్వం ఆదేశించింది. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ఎలాంటి ప్రకటనలు చేయరాదని వారికి ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది.
కానీ ఆ ఆదేశాలను మహిళా అధికారిణులు పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. తాజాగా ఆర్టీఐ కార్యకర్త గంగరాజు, ఐపీఎస్ అధికారిణి రూప మౌద్గిల్ ల మధ్య సంభాషణకు సంబంధించిన ఆడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ ఆడియోలో రోహిణి సింధూరి గురించి రూప మౌద్గిల్ అసభ్యంగా మాట్లాడారు.
రోహిణి సింధూరిపై ఫిర్యాదు చేయాలంటూ తనపై రూప మౌద్గిల్ బలవంతం చేశారని గంగ రాజు అన్నారు. రోహిణి సింధూరి ప్రైవేట్ చిత్రాలను తనకు రూప మౌద్గిల్ పంపించారని ఆయన చెప్పారు. రోహిణి సింధూరికి వ్యతిరేకంగా మాట్లాడాలని తనను రూప కోరారని అన్నారు.
రూపపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. రూపకు సంబంధించిన రెండు కాల్ రికార్డులు తన దగ్గర ఉన్నాయని, భూ ఒప్పందానికి సంబంధించి రూప తనను సీబీఐ అధికారిలా ప్రశ్నించారని ఆరోపించారు. ఆమె ప్రశ్నలన్నింటికీ ఓపికగా సమాధానమిచ్చానన్నారు అలా అని తాను రోహిణ సింధూరికి మద్దతుదారుడిని కానన్నారు.
రోహిణి సింధూరి కుటుంబం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆడియోలో రూప అన్నారు. తన భర్త రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నారని, భూముల కొనుగోలు విషయంలో ఆయన సలహాలు సూచనలు తీసుకున్నారని చెప్పారు. ఇప్పుడు రోహిణి వల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. రోహిణి క్యాన్సర్ రోగం లాంటి వ్యక్తి అని ఆమె మండిపడ్డారు. ఆమె ఎవరినైనా ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు.