మన దేశంలో వివాహం అంటేనే ఓ పెద్ద పండుగల నిర్వహిస్తారు. లక్షలకు లక్షలు పోసి పెద్ద ఎత్తున డెకరేషన్లతో ఆడంబరంగా నిర్వహిస్తారు. ఇక పెండ్లిలో భోజనాలపై చేసే ఖర్చు అంతా ఇంతా కాదు. కానీ చాలా సందర్భాల్లో ఆ భోజనాల్లో ఎక్కువ భాగాన్ని వృథాగా చెత్త కుండీల్లో పారవేస్తారు.
అయితే ఓ వైపు దేశంలో చాలా మందికి తినడానికి కనీసం ఒక్క పూట కూడా తిండి సరిగా దొరకని పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ధనవంతులు చేస్తున్న ఈ వృథాను చూస్తే బాధ కలగక మానదు. తాజాగా దీనిపై ఐఏఎస్ అవనీశ్ శరణ్ కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఆ ఫోటోల్లో ఓ పెండ్లిలో విందు కోసం ఉపయోగించిన ప్లేట్లను ఓ వ్యక్తి క్లియర్ చేస్తున్నాడు. ఆ సమయంలో కింద పెద్ద ఎత్తున ఆహారం కుప్పగా పడి ఉంది. ఆ ఫోటోలను షేర్ చేస్తూ దానికి ‘ మీ పెండ్లి మొత్తంలో ఫోటో గ్రాఫర్ మిస్ చేసిన ఫోటో ఇదే” అంటూ క్యాప్షన్ పెట్టారు. దయచేసి ఆహారాన్ని వృథా చేయకండి అంటూ కోరారు.
దీనిపై నెటీజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఆహారం వృథా కాకుండా ప్రత్యేకమైన నిబంధనలు తీసుకురావాలని కొందరు సూచించారు. అలా వృథా చేయడం కన్నా ఆకలితో బాధపడుతున్న వారికి దాన్ని అందజేస్తే బాగుండేదని మరికొంద అభిప్రాయపడ్డారు.