పవర్‌లో లీడర్ వుండేది ఐదేళ్లే. ఉద్యోగులు, అధికారులు పర్మనెంట్. ఆ విషయం మరచిపోతేనే వారికి ఇబ్బంది. పైగా అత్యున్నత సర్వీసుల్లో వున్న అధికారులు రాజకీయాలు మాట్లాడితే చూడ్డానికి, వినడానికీ కూడా బాగోదు. పురపాలక శాఖ కమిషనర్‌గా వున్న ఐఎఎస్ అధికారి పాలిటిక్స్‌లో వున్నాననుకున్నాడో ఏమో.. గత తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిట్టిపోశాడు. జగన్ సర్కారును ప్రశంసించాడు. ఇది ప్రైవేట్ కార్యక్రమం అయితే అంత ఇబ్బంది వుండేది కాదు, ప్రభుత్వ కార్యక్రమంలో విజయకుమార్ పాలిటిక్స్ మాట్లాడ్డమే షాకింగ్ న్యూస్..

గుంటూరు: గత టీడీపీ సర్కారు హయాంలో ఉద్యోగాలు పొందడం కలగా మారిందని, యువత ఉపాధిని వెదుక్కుంటూ వలసలు పోవడం సర్వ సాధారణమైందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఐఎఎస్ అధికారి విజయకుమార్. అక్కడితో ఆయన ఆగలేదు. గత టీడీపీ ప్రభుత్వాన్ని తిడుతూ.. జగన్ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ భక్త రామదాసుకు మించిన కీర్తనలు వినిపించాడు.
‘టీడీపీ హయాంలో యువత ఉపాధి వెతుక్కుంటూ పోయింది. ఈ తరుణంలో ‘కారుచీకట్లో కాంతి రేఖ’ మాదిరిగా వైసీపీ ప్రభుత్వం వచ్చి.. లక్షలాది ఉద్యోగాల భర్తీ చేపట్టి, యువతను ప్రభుత్వోద్యోగులను చేసింది’ అని విజయకుమార్ అన్నారు. చరిత్రలో చిరస్థాయిలో నిలిచిన గుప్తుల స్వర్ణయుగాన్ని జగన్ మళ్లీ తీసుకొచ్చారని పొగడ్తలే సిగ్గుపడేలా పొగిడిపడేశాడు. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా జగన్ స్థానిక సుపరిపాలనలో ‘స్వర్ణయుగా’న్ని తెస్తున్నారని కొనియాడారు. మంత్రి బొత్స సత్యనారాయణను అయితే ఆయనే దిగ్భ్రమ చెందేలా చిడతలు అందుకున్నాడు ఈ అధికారి. బొత్సను ‘సునిశిత మేధావిగా, ఏకసంథాగ్రాహి’గా అభివర్ణించాడు.
సోమవారం విజయవాడలో గ్రామ/వార్డు సచివాలయ కార్యదర్శులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో ఈ భజన జరిగింది. రాష్ట్ర పురపాలక కమిషనర్ జేఎస్సార్కేఆర్ విజయకుమార్ సీఎం జగన్‌ను వేదికపై స్తుతించిన తీరు ఆ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేసింది. ఇంతలా పొగుడుతుంటే వైసీపీ ద్వితీయశ్రేణి నాయకుడు ఎవరైనా మాట్లాడుతున్నారని అందరూ భావించారు. తీరా అతను మునిసిపల్ శాఖ కమిషనర్ అని తెలిసి కాస్త కంగారు పడ్డారు.
విజయకుమార్ ఇంకా ఏమన్నాడంటే.. ‘‘ఇప్పటి వరకూ మనకు ‘ఫ్రెంచ్ రివల్యూషన్, అక్టోబరు విప్లవం’ లాంటివి మాత్రమే తెలుసు. కానీ ముఖ్యమంత్రి జగన్ సచివాలయ వ్యవస్థను సంకల్పించడం ద్వారా స్థానిక పరిపాలనా వ్యవస్థలో ‘సెప్టెంబరు రివల్యూషన్‌ను తీసుకొచ్చారు. అత్యంత గొప్ప చక్రవర్తిగా పేరుగాంచిన అశోకుడికి ‘దేవతలు మెచ్చిన రాజు’ అనే బిరుదు ఉండేది. ఆయన మాదిరిగానే సకల జనరంజకంగా పాలన, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా జగన్ కూడా ‘దేవుని బిడ్డ’ అయ్యారు’’ అని విజయకుమార్ ప్రశంసల జల్లు కురిపించాడు.