ఐఏఎస్‌ల కేడర్ విషయంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సివిల్ సర్వీసెస్ అభ్యర్థి తనకు నచ్చిన కేడర్‌లో, నచ్చిన ప్రాంతంలో కేటాయించాలని డిమాండ్ చేసే హక్కు లేదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. పరీక్షల్లో అర్హత సాధించిన తర్వాత దేశంలో ఎక్కడైనా పని చేయడానికి సివిల్ సర్వీసెస్ అభ్యర్థి ముందే ఒప్పుకుంటారని తెలిపింది.
తన సొంత రాష్ట్రం కేరళ కేడర్ ఇవ్వాలంటూ ఓ ఐఏఎస్ అధికారి 14 ఏండ్లుగా న్యాయపోరాటం చేస్తున్నారు. ఆ పిటిషన్ పై జస్టిస్ హేమంత్ గుప్తా, వి. రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టింది. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది.
2017లో ఐఏఎస్ అధికారిణి షైన్ మోల్‌కు అనుకూలంగా కేరళ హైకోర్టు తీర్పు వెల్లడించింది. హిమాచల్ ప్రదేశ్ కేడర్ లో ఉన్న ఆమెను సొంత రాష్ర్టం కేరళకు మార్చాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.
గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తాజాగా కొట్టి వేసింది. ఐఏఎస్ కేడర్ అధికారులు తమకు నచ్చిన ప్రాంతాల్లో, నచ్చిన కేడర్ లో నియమించాలని డిమాండ్ చేసే హక్కులేదని వెల్లడించింది. కేడర్ కేటాయింపులనేది హక్కులకు సంబంధించిన అంశం కాదని వ్యాఖ్యానించింది.
ఎంపికైన అభ్యర్థికి కేవలం ఐఏఎస్ కేడర్ నియామకం కోసం డిమాండ్ చేసే హక్కు మాత్రమే ఉందని చెప్పింది. దేశంలో ఎక్కడైనా పని చేస్తానని అభ్యర్థులు ఎంపికకు ముందే ఒప్పుకున్నందునా ఆ హక్కు లేదని న్యాయమూర్తులు అన్నారు. అభ్యర్థులకు తన ఇష్టానుసారం కేడర్‌ను కేటాయించే అధికారం రాష్ట్రానికి లేదని పేర్కొంది.
ఐఏఎస్ కేడర్ రూల్స్ -1954లోని 5(1) అనేది ఐఏఎస్‌ల కేటాయింపుల విషయంలో రాష్ట్రాల జోక్యాన్ని నిరోధిస్తుందని పేర్కొంది. కాబట్టి, కేడర్ కేటాయింపు సర్క్యులర్‌ను ఉల్లంఘించారనే వాదనపై ట్రిబ్యునల్ లేదా హైకోర్టు జోక్యం చేసుకోకుండా ఉండాల్సిందని వ్యాఖ్యానించింది.