– ధరణి సమస్యలపై ఇప్పుడిప్పుడే దృష్టి
– సోమేష్ తిరిగొస్తున్నారని ప్రచారం
– ఆయన మళ్లీ వస్తే రికార్డుల సవరణలకు అడ్డంటూ ఆరోపణలు
– అప్పటి ప్రాధాన్యత ఇప్పుడు ఉండదంటున్న నేతలు
– మరో వారంలో స్పెషల్ సెక్రటరీగా ఎంట్రీ!
– ఆర్డీవో, ఎమ్మార్వోలకు ధరణి ఎడిటింగ్ ఆప్షన్
క్రైం బ్యూరో, తొలివెలుగు:
మాజీ సీఎస్ సోమేష్ కుమార్ తెలంగాణను వదిలేలా కనిపించడం లేదు. సిల్లీ రీజన్ తో తెలంగాణ క్యాడర్ లో కొనసాగి చివరకు హైకోర్టు తీర్పుతో ఆంధ్రాకు వెళ్లిపోయారు. ఆయన సీఎస్ గా ఉన్నసమయంలో ధరణిని తీసుకొచ్చారు. ఎక్సైజ్ కమిషనర్ గా కొత్త పాలసీలతో తెలంగాణ ప్రభుత్వానికి లిక్కర్ ద్వారా ఆదాయాన్ని పెంచారు. కానీ, ప్రజల ఆరోగ్యాలను పట్టించుకోలేదని ప్రజా సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఎన్నో వివాదాలు ఉన్న తెలంగాణ భూముల తేనెతుట్టెను కదిపారు. ధరణితో భూ సమస్యలు పరిష్కారం కావాల్సింది పోయి మరింత జటిలం అయ్యాయని సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు.
వివాదం లేని ప్రాంతాల్లో కూడా కబ్జా కాలాన్ని ఎత్తి వేసి లిటిగేషన్స్ సృష్టించారని విమర్శలూ ఉన్నాయి. దీనంతటికీ కేసీఆర్ కారణమని బయటకు తెలిసినా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో సోమేష్ కుమార్ ఫెయిల్ అయ్యారని మంత్రులే చెబుతున్నారు. ఇటీవల టెక్నికల్ గా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా కేటీఆరే ఒప్పుకున్నారు.
ఆర్డీవోలకు ఎడిటింగ్ ఆప్షన్
ధరణిలో మార్పులు చేయాలంటే కలెక్టర్లకే అధికారం ఉంది. ఎంతో నిబద్ధతతో పనిచేయాల్సిన కలెక్టర్లు లంచాలకు అలవాటు పడి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. దీనికోసం సీఎస్ సోమేష్ కుమార్ ఓ కోటరీని మెయింటెన్ చేశారని అధికార పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. అన్నీపక్కాగా ఉన్నా సొమ్ములిస్తేనే పనులు చేశారని అంటున్నారు. ఎమ్మెల్యేలు చెప్పినా సీఎస్ నుంచి లేదా కేసీఆర్ కుటుంబ సభ్యుల నుంచి ఫోన్ వస్తేనే క్లియర్ చేశారని చర్చించుకుంటున్నారు. అసలు ఏది నిజమో.. ఏది అబద్దమో తెలియకుండానే గుడ్డిగా కలెక్టర్లు పని చేశారని ఆరోపణలు చేస్తున్నారు.
కొత్త సీఎస్ వచ్చిన తర్వాత సీసీఎల్ఏపై దృష్టి సారించారు. నవీన్ మిట్టల్ చీఫ్ గా రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, గ్రౌండ్ లెవల్ లో ఆర్డీవో, ఎమ్మార్వోలకు ఎడిటింగ్ ఆప్షన్ ఇచ్చేలా యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మళ్లీ సోమేష్ వస్తే ప్రభుత్వ పెద్దలను తప్పుదారి పట్టిస్తారని అధికార వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. గతంలో అన్నీ తానై నడిపించి 7 డిపార్ట్ మెంట్లలో ప్రత్యక్షంగా పనులు చేసిన సోమేష్ కు మరోసారి అవకాశం ఇస్తే ఇంకేదైనా చేస్తారని అనుమానిస్తున్నాయి.
ఎక్సైజ్ లో ఆదాయంపై ఉన్న ప్రేమ ఆరోగ్యంపై లేకపాయే!
బిహార్ ఐఏఎస్ లు ప్రభుత్వానికి కావాల్సిన ఆదాయం చూపించి మంత్రులకు, ముఖ్యమంత్రులకు దగ్గర అవుతారని అధికారుల్లో చర్చ నడుస్తోంది. దాన్ని తెలంగాణలో చేసి చూపించారని అనుకుంటున్నారు. ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చి రూ.20 వేల కోట్ల ఆదాయాన్ని పెంచారని, టెండరింగ్ లో కొత్త విధానాలు అమలు చేయించారని మాట్లాడుకుంటున్నారు. రాష్ట్రంలో 24 గంటలు మద్యం అందుబాటులో ఉండేలా బెల్ట్ షాపులు ఉన్నా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. మద్యాన్ని ఎంత ఎక్కువ ధరకు అమ్మినా చలనం ఉండదని, స్వప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా వ్యవహరించి ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేయడంలో కీలక పాత్ర సోమేష్ కుమార్ దే అని గుసగుసలాడుకుంటున్నారు.
గత ప్రాధాన్యత మళ్లీ దక్కేనా?
సోమేష్ బ్యాక్ టు తెలంగాణ అని అందరి కంటే ముందే తొలివెలుగు పసిగట్టింది. వార్తలు ప్రచురించింది. అందుకు తగ్గట్టుగానే ఆయన వీఆర్ఎస్ తీసుకున్నారు. దానికి ఏపీ సర్కార్ కూడా ఆమోద ముద్ర వేసింది. ఇక తెలంగాణ ప్రభుత్వంలో జాయిన్ అవ్వడమే మిగిలింది. అయితే.. కేసీఆర్ కు ఒక్కసారి దూరం అయితే ఇక అంతే సంగతులు అని అంతా అంటారు. సోమేష్ కుమార్ చేసిన సేవలతో ఆయనకు ఏఏ శాఖలు ఇస్తారు.. సీఎస్ ఉన్నప్పటి ప్రాధాన్యత ఇప్పుడు స్పెషల్ సీఎస్ కు ఇస్తారా? అనేది ఆసక్తిగా మారింది. మరోవైపు ఎక్సైజ్ శాఖ వరకే పరిమితం చేసి రెవెన్యూ నవీన్ మిట్టల్ కే వదిలేస్తారని చర్చ జరుగుతోంది. మళ్లీ రెవెన్యూ లో వేలు పెడితే.. సమస్యలు అట్లే ఉంటాయని అధికార పక్ష నేతలే అనుకోవడం గ్రౌండ్ లెవల్ లో ధరణి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.