జార్ఖండ్ లో నరేగా నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆ రాష్ట్ర మైన్స్ శాఖ కార్యదర్శి ఐఏఎస్ పూజా సింఘాల్ ను ఈడీ అరెస్టు చేసింది. ఈ కేసులో అరెస్టు అయిన ఆ అధికారి చార్టెడ్ అకౌంటెంట్ కుమార్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మే 7న సుమన్ కుమార్ ఇంటి నుంచి 17 కోట్ల డబ్బును ఈడీ స్వాధీనం చేసుకున్నది.
ఈ అంశంలో ఈడీ విచారణ చేపట్టింది. సుమన్ కుమార్ తన వాంగ్మూలంలో ఆ డబ్బు అంతా పూజా సింఘాల్‌దే అని చెప్పాడు. తన ఇంటి నుంచి సీజ్ చేసిన సొమ్ము ఎక్కువ శాతం పూజదే అన్నాడు. ఐఏఎస్ పూజ ఇచ్చిన ఆదేశాల మేరకు ఓ ప్రఖ్యాత బిల్డర్‌కు మూడు కోట్లు ఇచ్చినట్లు ఆ అకౌంటెంట్ విచారణలో తెలిపాడు.
రాంచీలోని పల్స్ హాస్పిటల్ భూమిని ఆ డబ్బుతో ఖరీదు చేసినట్లు తెలుస్తోంది. పల్స్ సూపర్ స్పెషాల్టీ హాస్పిటల్ నిర్మాణంలో పూజ కీలక పాత్ర పోషించిందని.. ఆ హాస్పిటల్ నిర్మాణం కోసం పేమెంట్స్ అన్నీ నగదు రూపంలో ఇచ్చినట్లు అకౌంటెంట్ వెల్లడించాడు.
ఈ నేపథ్యంలో ఐఏఎస్ సింఘాల్ మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయని ఈడీ కోర్టులో చెప్పింది. మైన్స్ శాఖలో కార్యదర్శిగా ఉన్న పూజను మే 11వ తేదీన అరెస్టు చేశారు. 12న ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేసింది.