అతి చిన్న వయస్సులోనే ఐఏఎస్ అయి, సీఎస్ గా అత్యధిక కాలం పనిచేసే అవకాశం ఉన్న ఐఏఎస్ శ్రీలక్ష్మి… జగన్ అక్రమాస్తుల కేసు వల్ల కెరీర్ ను నష్టపోవాల్సి వచ్చింది. అరెస్టులు, కేసులు ఆమెను చుట్టుముట్టేశాయి. కొంతకాలం ఉద్యోగానికి దూరంగా ఉన్న ఆమె, రాష్ట్ర విభజనలో భాగంగా తెలంగాణకు కేటాయించారు.
కానీ, ఏపీలో జగన్ అధికారంలోకి రాగానే శ్రీలక్ష్మి ఏపీకి వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సీఎం జగన్ కేసీఆర్ తో భేటీ కాగానే శ్రీలక్ష్మి, ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్రతో పాటు మరో ఐఏఎస్ ను ఏపీకి కేటాయించాలని కోరగా ఆయన అంగీకరించారు. కానీ కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్ రాకపోవటంతో ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. కానీ శ్రీలక్ష్మి మాత్రం తన ప్రయత్నాలు ఏమాత్రం ఆపలేదు. ఓవైపు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సీఎం జగన్ సమావేశం అయినప్పుడల్లా ఈ ఇష్యూను తమ ముందుంచటంతో పాటు, తనది ఏపీ అని వాదిస్తూ క్యాట్ ను కూడా ఆశ్రయించింది.
దీంతో ఫైనల్ గా ఆమెను ఏపీ క్యాడర్ కు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇప్పుడు సీఎం జగన్ సర్కారులో ఆమెకు అత్యంత కీలకమైన పోస్టులు దక్కనున్నాయని, అవసరం అయితే సీఎంవోలోకి తీసుకుంటారన్న ప్రచారం సాగుతుంది.