ఐఎఎస్ శ్రీలక్ష్మి. ఇప్పుడు పెద్దగా ప్రచారంలో లేని పేరే అయినా… జగన్ అక్రమాస్తుల కేసు సమయంలోనూ, వైఎస్ పరిపాలన సమయంలోనూ గట్టిగా వినపడ్డ పేరు. అతిచిన్న వయస్సులో ఐఎఎస్ అయిన శ్రీలక్ష్మికి అతి ఎక్కువ కాలం సీఎస్ గా విధులు నిర్వహించే సర్వీసు ఉండేది. కానీ జగన్ కేసుల్లో ఇరుక్కొని, జైలుపాలై… తెలంగాణ క్యాడర్ లో లూప్ లైన్ లో ఉండిపోయింది.
కానీ ఏపీలో జగన్ అధికారంలోకి రాగానే… అతికష్టం మీద క్యాడర్ మార్పించుకున్న శ్రీలక్ష్మి, వచ్చి రాగానే సెక్రటరీ స్థాయి మంచి శాఖను పొందింది. అయితే, కేసుల హాడావిడి లేకుండా ఉంటే ఎప్పుడో తను ముఖ్యకార్యదర్శి హోదాకు వచ్చేది. అయితే, కేసులు ఇంకా విచారణ దశలోనే ఉన్న నేపథ్యంలో శ్రీలక్ష్మికి ముఖ్యకార్యదర్శి హోదాను కట్టబెడుతూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు సీఎస్ ఆధిత్యనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే, ఈ ఉత్తర్వుల్లో సీఎస్ చాకచక్యంగా వ్యవహరించినట్లుగా కనపడుతుంది. ప్రమోషన్ ఇస్తూనే… ఇవన్నీ కోర్టు తుది తీర్పుకు లోబడి ఉంటాయని పేర్కొని, ఉత్తర్వులను ఎవరూ సవాల్ చేయని విధంగా పదవి కట్టబెట్టేశారు. ఇందులో అసలు విశేషం ఏంటంటే… సీఎస్ ఆధిత్యనాథ్ కూడా గతంలో జగన్ అక్రమాస్తుల కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారే.