టీవీ ఛానెల్స్‌కు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కీలక అడ్వయిజరీ జారీ చేసింది. నేరాలు, ప్రమాదాలు, దాడులు, హింసకు సంబంధించిన వార్తా ప్రసారాల విషయంలో టీవీ ఛానెల్స్ కు మార్గదర్శకాలు విడుదల చేసింది. భయం కలిగించే వీడియోలు, రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రుల ఫోటోలు, మృతదేహాలను యథావిధిగా రిపోర్ట్ చేయకూడదని సూచించింది.
మీడియా బాధ్యతాయుతమైన కంటెంట్ ప్రసారం చేయాలని కేంద్రం కోరింది. ప్రమాదాలు, హింస, నేరాలకు సంబంధించిన విషయాల్లో టీవీ ఛానళ్లు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రోగామ్ కోడ్‌కు అనుగుణంగా ఫుటేజ్‌లను ప్రసారం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన గాయపడిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేసింది.
కొన్ని మీడియా ఛానల్స్ మృతదేహాలు, రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రుల ఫోటోలను అత్యంత దగ్గర నుంచి చూపిస్తున్నాయని పేర్కొంది. ఉపాధ్యాయులు పిల్లలను కొడుతున్న వీడియోలు, మహిళలు, చిన్నారులు, పెద్దలపై దాడులకు సబంధించిన ఫుటేజ్‌లను మళ్లీ మళ్లీ ప్రసారం చేస్తున్నట్టు తెలిపింది.
ఇలా బ్లర్రింగ్ చేయకుండ రిపోర్టు చేయడం చాలా బాధకరమని పేర్కొంది. అంతే కాకుండా ఇది ప్రోగ్రామ్ కోడ్ నిబంధనలకు వ్యతిరేకమని చెప్పింది. వీక్షకులను కూడా ఇవి కలవరపాటుకు గురిచేస్తోందన వెల్లడించింది. చిన్నారులపై ఎక్కువగా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. బాధితుల గోప్యతకు కూడా భంగం కలుగుతోందని చెప్పింది.
కుటుంబంలో అన్ని వయసుల వారు కలిసి టీవీ కార్యక్రమాలు చూస్తుంటారని, ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యంగా నేరాలు, ప్రమాదాలు, హింసకు సంబంధించిన కథనాల విషయంలో బాధ్యతాయుతమైన ప్రసారాలు చేయలని సూచనలు చేసింది.