ఐసీసీ టీ-20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ఈ టోర్నీని నిర్వహించనున్నారు. ఒమన్‌తో పాటు యూఏఈలో ఈ టీ-20 సంగ్రామం కొనసాగనుంది.
రౌండ్ 1లో గ్రూప్ బిలోని ఒమన్, పపువా న్యూ గినియా మ్యాచ్ తో టోర్నీ ప్రారంభం కానుంది. అక్టోబర్ 17న ఈ మ్యాచ్ జరుగనుంది. అదే రోజు స్కాట్లాండ్, బంగ్లాదేశ్ మరో మ్యాచ్ లో తలపడనున్నాయి.
అక్టోబర్ 23 నుంచి సూపర్-12 స్టేజ్ ప్రారంభం అవుతుంది. అబుదాబిలో జరిగే ఫస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఢీకొట్టనున్నాయి. అదే రోజు దుబాయ్ లో ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి.
ఇక క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్, పాక్ మ్యాచ్ అక్టోబర్ 24న జరగనుంది. ఆ తర్వాత టీమిండియా 31న న్యూజిలాండ్, నవంబర్ 3న ఆఫ్ఘనిస్థాన్ తో ఆడనుంది.
నవంబర్ 10న అబుదాబిలో తొలి సెమీ ఫైనల్ ఉంటుంది. 11న దుబాయ్ లో రెండో సెమీస్ ను నిర్వహించాలని ప్లాన్ చేశారు. నవంబర్ 14న ఫైనల్ మ్యాచ్ దుబాయ్ లో జరగనుంది. సెమీస్, ఫైనల్ మ్యాచ్ లకు రిజర్వు డే కేటాయించారు.