ముల్లును ముల్లు తోనే తీయాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇదే ఫార్ములాను ఫాలో అవుతోంది. డెంగ్యూ, చికెన్ గున్యాలను కలుగ చేసే దోమలకు దోమలతోనే చెక్ పెట్టాలని ప్రయత్నాలు చేస్తోంది.
డెంగ్యూ, చికెన్ గున్యాలు దోమల ద్వారా వస్తాయి. అందువల్ల వాటిని అరికట్టాలంటే ముందుకు దోమలకు చెక్ పెట్టాలి. ఈ నేపథ్యంలో డెంగ్యూ, చికెన్ గున్యా కలుగ జేసే దోమలకు ఆ దోమలతోనే చెక్ పెట్టాలని ఐసీఎంఆర్ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు వెక్టార్ కంట్రోల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (వీసీఆర్సీ)తో కలిసి ఐసీఎంఆర్ అలాంటి ప్రక్రియను అభివృద్ధి చేస్తోంది.
పుదుచ్చేరిలోని ఐసీఎంఆర్- వీసీఆర్సీలు కలిసి రెండు అడీస్ ఈజిప్టీ దోమల కాలనీలను అభివృద్ధి చేశాయి. ఈ ప్రాంతాల్లో వైరల్ వ్యాధులను పూర్తిగా తగ్గించే ప్రక్రియలో భాగంగా దోమలకు wMel, wAlbB Wolbachia స్ట్రెయిన్లను దోమల్లో ఇన్ఫెక్ట్ చేశారు.
ఆస్ట్రేలియాలోని మొనాష్ యూనివర్సిటీ నుంచి wMel, wAlbB స్ట్రెయిన్ గల పదివేల దోమల గుడ్లను రీసెర్చ్ ల కోసం పుదుచ్చేరికి తీసుకువచ్చినట్టు పుదుచ్చేరిలోని ఐసీఎంఆర్-వీసీఆర్సీ డైరెక్టర్ డాక్టర్ అశ్వనీ కుమార్ తెలిపారు.
ఈ వొల్బాచియా గుడ్లను పొదిగించగా కొత్త దోమలు వచ్చాయని చెప్పారు. ఇవి అడీస్ ఈజిప్టీ దోమలతో ‘సంపర్కం’ చేయడం ద్వారా వోల్బాచియా దోమలు పుట్టాయన్నారు. వీటిలో డెంగ్యూను కలగజేసే వైరస్ ఉండదని ఆయన పేర్కొన్నారు.
ఈ టెక్నాలజీలో మంచి సామర్థ్యం ఉందన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం అధ్యయనం ప్రారంభించామని, ఇప్పుడది పూర్తయిందిని పేర్కొన్నారు. వాటికి ప్రభుత్వ అనుమతులు రావాల్సి ఉందన్నారు.