పెళ్లిళ్లు స్వర్గంలోనే నిర్ణయించేస్తారని అంటుంటారు. కానీ ఆ ఊరిలో మాత్రం ముమ్మాటికి మనుషులు, వారి మనసులే వైవాహిక జీవితాన్ని నిర్ణయిస్తాయి. కులం, మతం ఆ ఊళ్లో సెకండరీ. మనోడేనా.. మన పిల్లేనా.. అన్న ప్రశ్నలకు చాలా దూరమది. ఒకరిపై ఒకరు మనసుపడితే చాలు.. వారి మనువుకు అంతకు మించిన అర్హతను చూడరక్కడ. కులమతాల పేరుతో నేటికీ కొట్టుకుని చచ్చిపోతున్నా ఈ రోజుల్లో.. అవేవీ పట్టించుకోకుండా ఆ ఊరిలో ‘ప్రేమ’ ఫరిడవిల్లుతోంది. ఒకటీ,రెండూ కాదు..ఏకంగా 50 ప్రేమ పెళ్లిళ్లతో ఆ ఆదర్శ గ్రామంగా మన్ననలు అందుకుంటోంది.
వనపర్తి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని అచ్యుతాపురమే ఆ ఆదర్శ గ్రామం. ఇప్పటి వరకు అక్కడ 50 ప్రేమ వివాహాలు జరిగాయి. ప్రేమ వివాహాలు అంత బలమైనవి కావని, చివరి వరకూ నిలబడవన్న రోటిన్ వార్నింగులు ఇచ్చే పెద్దల కళ్లు తెరిపించేలా ఆ జంటలు జీవిస్తున్నాయి. ప్రేమ వివాహం చేసుకున్న 50 జంటల్లో 95 శాతం మంది సంతోషంగా కుటుంబంతో గడుపుతున్నారు. ప్రేమ వివాహాల సమయంలో చిన్నచిన్న ఘటనలు మినహా పెద్దగా గొడవలు కూడా ఎప్పుడూ కాలేదని గ్రామస్తులు చెప్తున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న వారిలో కొన్ని జంటలు గ్రామంలోనే పనులు చేసుకుని జీవిస్తుండగా, మరికొందరు జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లారు.
అచ్చుతాపురంలో1941లోనే మొదటి ప్రేమ వివాహం జరిగింది. గ్రామానికి చెందిన నారాయణమ్మ, దేవిప్రసాద్ ఆయన్ను ప్రేమ వివాహ చేసుకుంది. నాటి నుంచి ప్రేమ ప్రయాణం అలా కొనసాగుతూనే వస్తోంది. కులాంతర ప్రేమ వివాహాల ఐక్య వేదిక పేరుతో ఓ సంఘం కూడా ఉంది ఇక్కడ. గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి దీన్ని ఏర్పాటు చేశారు. ఇటీవలే ప్రేమ వివాహాలు చేసుకున్న జంటలు.. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాయి. తమ అనుభవాలు, సంతోషాలను పంచుకుని ఉల్లాసంగా గడిపారు. ఏదేమైనా వేరే కులం అబ్బాయి, అమ్మాయి అనే మాట వినబడితే చాలు.. వెంటాడి, వెంటాడి పరువు హత్యలు చేయిస్తున్న ఈ రోజుల్లో ఆచ్చుతాపురం నిజంగా ఆదర్శనీయమే.