రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మద్యాహ్న భోజన పథకం నడుస్తోంది. పేరుకే పథకాలు కానీ సదుపాయాలు మాత్రం శూన్యం. అరకొర వసతులతో పిల్లికి బిచ్చం వేసినట్టు మద్యాహ్న భోజన పథకాన్ని కొనసాగిస్తున్నారని విద్యార్ధుల తల్లిదండ్రులు వాపోతున్నారు.
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం మెనూలో మార్పులు చేసేందుకు విద్యాశాఖ ప్రయత్నిస్తోంది. గురువారం రోజున మధ్యాహ్న భోజనానికి బదులు.. ఇడ్లీ, సాంబార్ ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా విద్యాశాఖ ఎంపిక చేసింది.
మండలంలోని చిర్రావూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో నూతన మెనూ ప్రకారం ఇడ్లీ, సాంబార్ వడ్డించనున్నారు. కాగా.. తాడేపల్లి మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు ఒక్కొక్కరికి నాలుగు ఇడ్లీలు, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఐదు ఇడ్లీలు ఇవ్వనున్నట్లు మధ్యాహ్న భోజన పథకం జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు.
గతంలో మధ్యాహ్న భోజనం పథకంలో పాత మెనూ ప్రకారం.. ప్రతీ గురువారం కిచిడీ, టమాట చట్నీ, ఉడికించిన గుడ్డును విద్యార్థులకు అధికారులు అందజేసేవారు. ఇప్పుడు ఖర్చును తగ్గించే ప్రయత్నంలో.. ప్రభుత్వం విద్యార్ధుల పొట్టకొడుతోందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.