ఒక్క రూపాయి. ఇప్పుడు విలువ అంతగా లేదు. తినడానికి ఏమీ రాదు. కానీ ఓ అవ్వ రూపాయికి వేడి ఇడ్లీ ఇస్తుంది. కొసరివడ్డిస్తుంది ఆ పేదరాశిపెద్దమ్మ !!
తమిళనాడు కోయంబత్తూరు జిల్లా వదివేలంపాయం గ్రామానికి చెందిన 80 ఏళ్ళ కమలత్తాల్ మానవీయకోణంతో తక్కువ ధరకు రూపాయికే ఒక ఇడ్లీ వేడివేడిగా అందిస్తున్నారు. వృద్ధురాలు అయినా రోజూ తానే పిండి గ్రైండ్ చేసి, ఇడ్లీ వండి వేడిగా పేద రోజు కూలీలు, వారి కుటుంబ సభ్యులకు అందిస్తోంది.
ప్రతిరోజు తన ఇంట్లోనే వెయ్యి ఇడ్లీ వండి వడ్డిస్తుంది. సాంబార్, చట్నీ రుచికరంగా ఇస్తుంది. లాభాపేక్ష లేదు. తక్కువ ధరకు ఫలహారం అందించే ఒక సైనికురాలు ఆ వృద్ధురాలు. ఇలా 30 ఏళ్లుగా చౌక ఇడ్లీ ఇస్తున్నారు. అంతకుముందు అర్ధరూపాయికే ఇడ్లీ ఇచ్చింది. ధరలు మరీ పెరగడంతో రూపాయికి ఇడ్లీ అమ్ముతోంది.
అవ్వ ఇచ్చే చౌక ఇడ్లీ కోసం చుట్టుపక్కల గ్రామాల వారు తరలి వస్తారు. ఇష్టంగా తింటారు. అవ్వ సేవను మెచ్చుకుంటున్నారు. పేదలపై ప్రభుత్వాలకు ఇలాంటి ప్రేమ ఉంటే ఆకలి దప్పులుండవు. రూపాయి ఇడ్లీ అవ్వా సుఖీభవ!!
ఇడ్లీ బామ్మకు కార్పొరేట్ల బాసట
తమిళనాడు కోయంబత్తూరు జిల్లా వడివేలంపాళ్యం గ్రామానికి చెందిన 80 ఏళ్ళ బామ్మ కమలతల్ రూపాయికే ఇడ్లీ, సాంబారు, చట్నీ ఇవ్వడాన్ని కార్పొరేట్లు అభినందించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర బామ్మకు కట్టెల పొయ్యి బదులుగా గ్యాస్ కనెక్షన్ సమకూర్చి నిరంతరం గ్యాస్ సరఫరా చేయడానికి ముందుకొచ్చారు. మనల్ని ఆశ్చర్యచకితులను చేసే అద్భుత గాధల్లో ఇది ఒకటని ప్రశంసించారు. ఆమె వ్యాపారంలో తన పెట్టుబడిగా ఎల్పీజీ గ్యాస్ స్టవ్ ఉంటుందని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు.
ఇక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా ఆనంద్ మహీంద్ర పిలుపుతో స్పందించింది. బామ్మ సామాజిక సేవ శభాష్..అంటూ ఆమెకు ఇండెన్ గ్యాస్ సిలిండర్ తో పాటు స్టవ్, రెగ్యులేటర్ ఐఓసీ అందజేసింది.
బామ్మ జీవితాంతం ఇక్కడ పేదలకు తక్కువ ధరకు ఫలహారం దొరుకుతుంది. కొందరు 10 రూపాయల ఇడ్లీలు తిని డబ్బులు లేవని రూ.5 ఇచ్చినా బామ్మ తీసుకుంటుంది. అసలు ఇవ్వలేమని కొందరు చెప్పినా ముసిముసి దరహాసంతో ఇడ్లీ అందజేస్తుంది. అదీ బామ్మ ఔ దార్యం.