– 800 కోట్ల స్క్రాప్.. 68 కోట్లేనట?
– అంచనాలు వేయడంలో అవకతవకలు?
– రీ టెండర్స్ కి పెరుగుతున్న డిమాండ్
– మేనేజ్మెంట్ నిర్లక్ష్యంతో..
– కోట్లాది రూపాయల సొమ్ము దొంగల పాలు
– 50 వేల కోట్ల స్థిరాస్తిని ఏం చేస్తారో?
– మాజీ ఉద్యోగుల్లో ఆందోళన
– తొలివెలుగు క్రైంబ్యూరో ప్రత్యేక కథనం
క్రైంబ్యూరో, తొలివెలుగు:కార్పొరేట్ కబంధహస్తాల్లో ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాసూటికల్ లిమిటెడ్ కంపెనీ దిగజారిపోయింది. దీన్ని 1967లో రష్యాతో కలిసి దేశంలోనే అత్యంత పెద్ద ఫార్మా కంపెనీగా ఏర్పాటు చేశారు. 47 బల్క్ సింథటిక్ మందులు ఇక్కడ తయారు అయ్యేవి. విటమిన్లు, సల్ఫాస్, క్లోరోక్విన్, మిథైల్ డోపా, అనాల్జెసిక్స్ వంటి వాటిని పెద్ద ఎత్తున తయారు చేసేవారు. ఇందులో పనిచేసిన రెడ్డి ల్యాబ్ అంజిరెడ్డి, మ్యాట్రిక్స్ ప్రసాద్, హెటిరో వ్యవస్థాపకులతో పాటు చాలామంది తర్వాత ప్రైవేట్ ల్యాబ్స్ పెట్టుకొని వేల కోట్ల లాభాలు ఆర్జించారు. 1996లో బల్క్, 2003లో ఫార్ములేషన్స్ మూతబడ్డాయి. ఇతర పరిశ్రమల్లో వ్యర్థాలను శుద్ధి చేయడానికి ఎఫ్లూయెంట్ ట్రీట్ మెంట్ ప్లాంట్ మాత్రమే(ఈటీపీ) కొనసాగింది. అప్పులు చెల్లించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం దీన్ని మూసి వేస్తున్నట్లు ప్రకటించింది. సుమారు 130 మంది ఉద్యోగులకు వీఆర్ఎస్ కూడా ఇచ్చింది.
స్క్రాప్ అంటూనే రేర్ మెటీరియల్ పై కన్ను
1967లో ఏర్పడిన ఈ కంపెనీ 100 ఏళ్ల ముందుచూపుతో మిషనరీ, మోటార్స్, స్టెయిన్ లెస్ స్టీల్ ను అమర్చింది. 200 ఏళ్లయినా కెమికల్ రియాక్ట్ కాకుండా ఉండేందుకు సెరామిక్ లైన్స్, కాపర్, గ్రాసర్స్, ఒక హెచ్పీ నుంచి 40 హెచ్పీలు ఉండే మోటార్స్ ను వేల సంఖ్యలో ఉంచింది. ఎలాంటి పేలుళ్లు జరిగినా చెక్కు చెదరని బై మెటాలిక్స్, సింక్రన్స్ మోటార్స్ ను అమర్చింది. ఎత్తిపోతలకు వాడే విధంగా ఉండే అండర్ గ్రౌండ్ మోటార్స్ ఇప్పటికీ బాగానే ఉంటాయని గతంలో అక్కడ పనిచేసిన ఉద్యోగులు చెబుతున్నారు. డియాక్టర్స్, రియాక్టర్స్ జీవితకాలం పని చేసేలా ఉండే మెటీరియల్స్ అని అంటున్నారు. మైల్డ్ స్టీల్ తప్ప.. మరే వస్తువు పాడవకుండా ఉంటుందని వివరిస్తున్నారు. 20 ఏళ్లుగా రసాయనాలు పైపుల్లో ఉన్నాయనే వంకతో.. ఎంతో విలువైన సంపదను కొల్లగొడుతున్నారని వీఆర్ఎస్ తీసుకున్న ఉద్యోగులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. 47 యూనిట్లలో 30 వేల సంఖ్యలో రష్యా స్పెషల్ గా తయారు చేసిన మోటార్స్ ఉన్నాయి. పాడవ్వని మెటీరియల్స్ లెక్కలు వేసినా 500 కోట్లకు తక్కువ కాదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. టెండర్స్ లో అవకతవకలు జరిగాయని ఐడీపీఎల్ టౌన్ షిప్ లోని మాజీ ఉద్యోగులు ధర్నా చేశారు. రీ టెండర్స్ లేదా రివర్స్ టెండర్స్ ద్వారా భారీగా ఆదాయం సమకూరుతుందని సూచిస్తున్నారు.
ప్రాణ వాయువు ఇక్కడి నుంచే!
హైదరాబాద్ లో తయారయ్యే ఆక్సిజన్ సిలిండర్స్ కి దేశంలో ఎక్కడా లేని డిమాండ్ ఉండేది. మోనోపలిగా అందరికీ ఐడీపీఎల్ సప్లై చేసేది. జడవాయువులను ఉంచేందుకు ప్రత్యేకమైన బాయిలర్స్ ఉండేవి. ఎలాంటి ఒత్తిడిలోనైనా, బ్లాస్టింగ్స్ నైనా తట్టుకుని ఉండే ప్లాంట్ లు ఇక్కడ 100 వరకు ఉన్నాయి. అక్సిజన్ ప్లాంట్స్ పెడుతామని ప్రభుత్వం ఆలోచించినా.. ఇప్పటికీ ఈ మెటీరియల్ తోనే ఏర్పాటు చేయవచ్చని చెబుతున్నారు. గాలి నుంచి ఆక్సిజన్ తీసి హైడ్రోజన్, నైట్రోజన్ తో కూడిన జడవాయివు ఎంతో కీలకమని ఆ రోజుల్లో కష్టపడ్డ ఉద్యోగులు నెమరు వేసుకుంటున్నారు.
మేనేజ్మెంట్ కనుసన్నల్లోనే..!
కెమికల్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఉండే ఐడీపీఎల్ కంపెనీకి జనరల్ మేనేజర్ గా రామకృష్ణా రెడ్డి వ్యవహరిస్తున్నారు. విజయ్ కుమార్, రామస్వామి, సర్పంచ్ ఇలా 8 మంది కీలక పదవుల్లో ఉన్నారు. వీరంతా కాంట్రాక్ట్ పద్ధతిలోనే పని చేస్తున్నారు. వీరు నిపుణులతో కూడిన కమిటీ వేసి అంచనాలు లెక్కించాలి. కానీ, అనుభవం లేని కన్సల్టెన్సీతో ఎస్టిమేషన్ వేయించి అంతా 70 కోట్లేనని తేల్చారు. దీని వెనుక మేనేజ్మెంట్ పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. మొత్తం టెండర్స్ లో 33 కంపెనీలు పాల్గొన్నాయని బీజేపీ నేతలు అంటున్నారు. ముంబైకి చెందిన కంపెనీ టెండర్స్ ని దక్కించుకుంది. అయితే.. ఇందులో బీజేపీ నేతలకు వాటా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. వందల కోట్ల ఆస్తిని అమ్మితే అప్పులు చెల్లించి.. భూమిని మరో భారీ ప్రాజెక్ట్ కి ఉపయోగపడేలా చేయాలని కోరుకుంటున్నారు. అయితే.. ఐడీపీఎల్ టౌన్ షిప్ ఓనర్స్ అసోసియేషన్స్ తమకు ప్లాట్స్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
దొంగలు భారీగానే కొట్టేశారు!
విలువైన టేకు వుడ్, అత్యంత ఖరీదైన కాపర్ రాడ్స్ చోరీకి గురయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. ఐడీపీఎల్ ఆస్తులను కాపాడటం కోసం డీఎస్పీ స్థాయి అధికారి ఇంచార్జీగా ఉంటారు. కానీ, కొంతమంది ప్రైవేట్ సెక్యూరిటీని దొంగిలించడమే పనిగా పెట్టుకున్నారని తెలుస్తోంది. ఈజీగా విప్పుకోవడానికి ఏ వస్తువు వస్తే దాన్ని తీసుకెళ్తున్నారని.. ఇటీవల ఫ్యాక్టరీని సందర్శించిన వారు చెబుతున్నారు. ఇక 891 ఎకరాలు ఇప్పుడు హాట్ కేక్ లా ఉంది. గజం అక్షరాలా రూ.1.75 లక్షలు. ఇప్పటికే 100 ఎకరాలు అప్పట్లో పనులు చేసిన కార్మికులతో నిండిపోయింది. పేదలు గుడిసెలు వేసుకున్నారు.
బాలానగర్ లో బడా రియల్ ఎస్టేట్
బాలానగర్ ఇండస్ట్రీ ఏరియాను ఖతం పట్టిస్తున్నారు. ప్రభుత్వం నుంచి కారు చౌకగా కొట్టేసిన కంపెనీలు భూమి విలువ పెరగడంతో పెద్దల అండదండలతో వందలాది ఎకరాలు కొట్టేస్తున్నారు. ఐడీఎల్ భూములను హిందుజా వారు ఫినిక్స్ కి ఎలా అమ్ముకున్నారో తొలివెలుగు క్రైంబ్యూరో ఇప్పటికే కథనాలు ఇచ్చింది. ఇప్పుడు ఐడీపీఎల్ భూముల్లో ఏం జరగబోతుంది అనే దానిపై కథనాలు ఇవ్వనుంది.