ఢిల్లీలోని ఇజ్రాయిల్ కార్యాలయం వద్ద ఐఈడీ పేలుడు సంభవించింది. సరిగ్గా 5.05నిమిషాలకు ఈ పేలుడు సంభవించటంతో ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఢిల్లీలో అలజడి రేపేందుకే ఈ పేలుడుకు ప్లాన్ చేశారా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఘటనా స్థలానికి ఎన్ఐఏ, ఢిల్లీ స్పెషల్ పోలీస్ టీంలు చేరుకున్నాయి.
ఓవైపు రిపబ్లిక్ డే ముగింపు వేడుకలు జరుగుతున్న సమయంలోనే ఈ పేలుడు సంభవించింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులంతా విజయ్ చౌక్ లోనే ఉన్నారు.
అబ్ధుల్ కలాం రోడ్ లో ఉన్న ఇజ్రాయిల్ ఎంబసీకి సమీపంలో పేలుడు జరిగింది. ఫుట్ పాత్ పై ఈ పేలుడు జరగ్గా… తక్కువ తీవ్రత గల ఐఈడీ పేలినట్లు అధికారులు గుర్తించారు. కేవలం మూడు కార్లు మాత్రమే ద్వంసం కాగా, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే, ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో ఇతర పేలుడు పదార్థాలున్నాయా…? అన్న కోణంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.