సాధారణంగా చాలా మందిలో ఉన్న అపోహ బల్లి ఆహారంలో పడితే ప్రాణాలు పోతాయని, ఆ ఆహారం విషపూరితం అయ్యే అవకాశం ఉందని. సినిమాల్లో చూపించే సన్నివేశాల ఆధారంగా ఇదే భయం వెంటాడుతుంది చాలా మందిని. అసలు ఇది ఎంత వరకు వాస్తవం…? బల్లికి నిజంగా ప్రాణాలను తీసే అంత శక్తి ఉందా…? బల్లిలో ఏమైనా విషపూరిత రసాయనాలు ఉన్నాయా…? వాస్తవం మాట్లాడుకుంటే బల్లికి ప్రాణాలు తీసే అంత విషం లేదు. కేవలం అది ఒక అపోహ మాత్రమె గాని బల్లి ప్రమాదకరం కాదని పరిశోధకులు పేర్కొన్నారు. దాని కారణంగా వాంతులు, విరోచనాల వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది గాని ప్రాణాలు పోయే అంత సీన్ లేదని స్పష్టం చేస్తున్నారు. ఇక బల్లి కారణంగా మన ఇంట్లో ఉండే ఎన్నో కీటకాలు పోయే అవకాశం ఉంటుంది.
పర్యావరణ సమతుల్యతలో బల్లులు కూడా తమ వంతు పాత్ర పోషిస్తాయి. అయితే వీటికి సంతానం ఎక్కువ కాబట్టి మనకు చికాకుగా ఉంటుంది. బల్లి ఇంట్లో నుంచి పోవడానికి కొందరు చంపుతూ ఉంటారు. ఇక బల్లి రూపం కూడా మనిషిని భయపెడుతుంది. దాని కళ్ళు కాస్త భిన్నంగా ఉంటాయి. అవి ఎటు చూసినా మన వైపు చూస్తున్నాయనే భ్రమలో మనం ఉంటాం. కాబట్టి దాని కారణంగా మనకు మరింత భయం ఉంటుంది.