400 మీటర్ల పొడవైన కంటైనర్ నౌక సూయిజ్ కాలువలో ఇరుక్కుపోయి ప్రపంచం మొత్తాన్ని కూడా కంగారు పెట్టింది. ప్రపంచ దేశాల్లో ఎంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా సరే ఆ నౌక బయటకు రావడానికి ఆరు రోజులు పైగా పట్టింది అంటే పరిస్తితి ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. మార్చి 23 నుంచి ఇది సూయిజ్ జలాల్లో ఇరుకైన ప్రాంతంలో చిక్కుకుని అలాగే ఉండిపోయింది.
సోమవారం, సాల్వేజ్ అధికారులు 2.20 లక్షల టన్నుల బరువైన ఓడను బయటకు లాగారు. ఇది అక్కడ ఇరుక్కుపోవడంతో వేలాది నౌకలు అక్కడ ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి. కొన్ని బలవంతంగా తిరిగి వెనక్కు వెళ్ళాయి. సూయిజ్ కాలువను చమురు మరియు శుద్ధి చేసిన ఇంధనాలు, ధాన్యం మరియు ఇతర వాణిజ్యం కోసం వాడతారు. తూర్పు మరియు పశ్చిమ దేశాల ప్రభుత్వాలు నానా ఇబ్బందులు పడ్డాయి.
ఇండియా కూడా వందల కోట్ల నష్టాలను ఎదుర్కొంది. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 12 శాతం ఈ కాలువ నుంచే జరుగుతుంది. రోజుకు 9 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం ఈ కాలువ ద్వారా జరుగుతుంది. జపాన్ సంస్థ తయారు చేసిన ఈ ఓడ కాలువలో ఆరు రోజుల పాటు ఇరుక్కోవడంతో… 54 బిలియన్లుగా ప్రపంచంలో నష్టాన్ని అంచనా వేసారు. కేవలం సరుకు రవాణా వలన జరిగిన నష్టం. ఆగిపోవడం లేదా ఆలస్యం కారణంగా ఈ నష్టం జరిగింది. ప్రపంచ వాణిజ్య వృద్ధిని 0.2 నుండి 0.4 శాతం వరకు తగ్గించింది అని సమాచారం. అదనపు షిప్పింగ్ ఆపరేషన్ ఛార్జీలు, వస్తువుల ధరలు మరియు షిప్పింగ్ ఆలస్యం వంటి ఖర్చుల నష్టం ఇంకా అంచనా వేయలేదు.