మంత్రి మల్లారెడ్డి బీజేపీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని..ఒక్క రాష్ట్రంలోనైనా తెలంగాణలా అభివృద్ధి చెందిందా అని ప్రశ్నించారు. 19 రాష్ట్రాల సీఎంలలో ఏ ఒక్కరైనా తెలంగాణ మోడల్ ను చూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
నేటి సభతో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం చెందుతుందన్నారు. ఈ సభకు తాము ప్రజలు తరలించడం లేదని వాళ్లే లక్షలాదిగా స్వచ్ఛందంగా తరలివస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అవతార పురుషుడని..ఆయన అభివృద్ధి చేయడానికే పుట్టాడని పొగడ్తలతో ముంచెత్తారు.
తెలంగాణ మోడల్ ను దేశ వ్యాప్తంగా చేయడానికే కేసీఆర్ నడుం బిగించాడని..వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మల్లారెడ్డి జోస్యం చెప్పారు. అలాగే బీజేపీ నాయకులవి పాసిపోయిన ముఖాలని, వారి ఫేస్ వాల్యూ లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారం ఉన్న వారికి చేతన కావడం లేదని..అందుకే ఐటీ,ఈడీ దాడులు చేస్తున్నారని విమర్శలు చేశారు.
కేసీఆర్ అంటే చరిత్ర అని..సింగిల్,డబుల్ ఇంజన్ కాదు.. దేశాన్ని తెలంగాణ మోడల్ చేయడమే కేసీఆర్ లక్ష్యమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఈ సభతో కేసీఆర్ అంటే ఏంటో యావత్ దేశానికి తెలుస్తుందన్నారు.