బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేంబ్రిడ్జి వర్సిటీలో ఎంపీ రాహుల్ గాంధీ అనని మాటలను కూడా ఆయన అన్నారంటూ బీజేపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తూ క్షమాపణలు కోరుతున్నారని థరూర్ మండిపడ్డారు.
రాజకీయాల్లో బీజేపీ పార్టీ బాగా రాటు తేలిందని ఆయన చురకలు అంటించారు. ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
ఒక వేళ విదేశీ గడ్డపై రాజకీయాలు మాట్లాడిన విషయంలో క్షమాపణ చెప్పాల్సి వస్తే మొదటగా ప్రధాని మోడీనే క్షమాపణ చెప్పాల్సి వుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి దేశ వ్యతిరేక వ్యాఖ్యలను తమ నేత రాహుల్ గాంధీ చేయలేదని వెల్లడించారు.
భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, ప్రజాస్వామ్యం పెనుముప్పును ఎదుర్కొటోందని లండన్ లోని కేం బ్రిడ్జి వర్సిటీలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. దేశంలో వ్యవస్ధలను నిర్వీర్యం చేస్తున్నారంటూ రాహుల్ గాంధీ ఇటీవల వ్యాఖ్యానించారు.