ప్రజాసమస్యలపై పోరాటం చేస్తే ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ లను హౌస్ అరెస్ట్ చేయడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రజానాయకులను నిర్బంధిస్తే ప్రజాగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని రేవంత్ హెచ్చరించారు.
ఇథనాల్ ప్రాజెక్ట్ ఏర్పాటు వల్ల ఆ ప్రాంతంలో కాలుష్యం పెరుగుతుందని రేవంత్ అన్నారు. దీంతోనే ప్రజలు,రైతులు ప్రాజెక్ట్ ను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తుంటే.. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. ప్రజల పోరాటానికి జీవన్ రెడ్డి, లక్ష్మణ్ కుమారులు సంఘీభావం ప్రకటిస్తే హౌస్ అరెస్ట్ చేయడం దారుణమన్నారు.
ప్రతిపక్ష పార్టీ మండలి నాయకుణ్ణి నిర్బంధిస్తారా అని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. జీవన్ రెడ్డితో పాటు లక్ష్మణ్ కుమార్ లను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇథనాల్ ప్రాజెక్ట్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో ప్రజలతో కలిసి కాంగ్రెస్ ఉద్యమబాట పడుతుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
కాగా ధర్మపురి నియోజకవర్గం వెల్కటూర్ మండలంలో ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేయడాన్ని గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు ఉపయోగించిన నీటితో కాలేశ్వరం నీరు కలుషితమవుతుందని..వాయు కాలుష్యం పెరిగిపోతుందని ఆందోళనకు దిగారు. ఈ ప్రాజెక్ట్ భూమి పూజకు వచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్ ను అడ్డుకోవడంతో ఆయన వెనుదిరగాల్సి వచ్చింది.