విదేశాల్లో భారత దేశ ప్రతిష్టను దెబ్బ తీసేట్టు తాను వ్యాఖ్యలు చేశానని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారని, ఈ ఆరోపణలపై పార్లమెంటులో వివరణనిచ్చేందుకు తనను అనుమతిస్తారని ఆశిస్తున్నానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రజాస్వామ్యమే ఉన్న పక్షంలో ఇందుకు తనకు అనుమతి లభించవచ్చునన్నారు. ‘కానీ వాళ్ళు నన్ను మాట్లాడనిస్తారని అనుకోను.. మధ్యలోనే నా ప్రసంగానికి అడ్డు తగలవచ్చు’ అని ఆయన పేర్కొన్నారు. గురువారం మీడియాతో ముచ్చటించిన ఆయన.. నేడు పార్లమెంటుకు తాను వచ్చిన ఒక్క నిముషంలోనే సభ వాయిదా పడిందన్నారు.
నా ఉద్దేశాలేమిటో పార్లమెంటుకు తెలియజేయాలనుకున్నానని చెప్పిన ఆయన.. బీజీపీకి చెందిన నలుగురు మంత్రులు తనపై పలు ఆరోపణలు చేశారన్నారు. వారికి అవకాశం ఇచ్చినట్టే తనకూ అవకాశం ఇవ్వాలి కదా అని రాహుల్ వ్యాఖ్యానించారు. లోక్ సభలో మాట్లాడేందుకు తనను అనుమతించాలని స్పీకర్ ఓంబిర్లాను కోరానని, కానీ ఆయన చిరునవ్వు నవ్వి ఎలాంటి హామీని ఇవ్వలేదని తెలిపారు.
సభలో మాట్లాడే హక్కు తనకుందని అన్నారు. లండన్ లో నేను చేసిన వ్యాఖ్యలపై రేగిన రగడ.. గత నెలలో పార్లమెంటులో తను చేసిన ప్రసంగం సందర్భంగా అడిగిన ప్రశ్నలకు సంబంధించిన ‘పరధ్యానం’ తప్ప మరేమీ కాదని ఆయన సమర్థించుకున్నారు
. ఆదానీతో ప్రధాని మోడీకి గల సంబంధాలపై ప్రశ్నలు సంధించే హక్కులు తనకున్నాయని, అదానీ అంశంపై మాట్లాడేందుకు ప్రధానితో బాటు ప్రభుత్వం కూడా భయపడుతోందని రాహుల్ అన్నారు. లండన్ లో తాను ఇండియాకు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదని ఆయన చెప్పారు. మీరు క్షమాపణలు చెబుతారా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా చిరునవ్వు నవ్వారు.