ప్రధాని మోడీపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. త్రివర్ణ పతాకంలోని ఆకుపచ్చ రంగును తొలగించాలని మోడీ సర్కార్ భావిస్తోందా…?అని ఆయన మండిపడ్దారు. పచ్చదనంలో కేంద్రానికి ఇన్ని ఇబ్బందులు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు.
దేశంలోని ముస్లింలు చదువుకోవడం బీజేపీ సర్కార్ కు ఇష్టం లేదని ఆయన ఆరోపణలు గుప్పించారు. పస్మాండ ముస్లింలపై ప్రధానికి అంత ప్రేమ వుంటే వారికి దళిత ముస్లిం హోదా ఇవ్వాలని ఆయన సూచించారు.
గతంతో పోలిస్తే ఈ ఏడాది బడ్జెట్‌లో మైనారిటీ పథకాలకు కేటాయింపులు తగ్గాయని ఆయన విమర్శించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు బడ్జెట్ కేటాయింపులు 38 శాతం తగ్గించబడ్డాయని ఆయన ఫైర్ అయ్యారు.
బిహార్ ముస్లింలకు ఓబీసీ హోదా కావాలని డిమాండ్ చేశారు. దేశ సంపదతో కొందరు పారిపోతున్నారని మండిపడ్డారు. పారిపోయిన వ్యక్తుల జాబితాలో మొఘల్ ల పేరు ఉందా..? ఆయన ప్రశ్నించారు. దీనిపై ప్రధాని ఏం మాట్లాడరని అన్నారు.
హిండెన్‌బర్గ్ సంస్థ భారత్ లో ఉండి ఉంటే, దానిపై చట్టవిరుద్ధమైన కార్యకలాపాల (నివారణ) చట్టాన్ని ప్రయోగించేవారని ఆయన ఆరోపించారు. ప్రార్థనా స్థలాల చట్టానికి భంగం కలిగించవద్దని అభ్యర్థించారు. చైనాకు ప్రధాని మోడీ భయపడవద్దన్నారు.