కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా తాను ఎన్నికైన పక్షంలో పార్టీ నేతలు పార్టీని వదిలి బీజేపీలో చేరకుండా చూస్తానని సీనియర్ నేత శశిథరూర్ చెప్పారు. అలాంటివారిని ఆపుతానన్నారు. ఇది తన మొట్టమొదటి బాధ్యత అన్నారు. తనను సమర్థిస్తున్నవారు రెబెల్స్ గానీ, గాంధీ కుటుంబానికి వ్యతిరేకులు గానీ కాదని, ఇది తప్పుడు అభిప్రాయమని అన్నారు. గాంధీలు సదా కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు.. అలాగే మేము కూడా.. ఎన్నికల్లో ఎవరు గెలిచినా అది పార్టీ విజయమే అని ఆయన వ్యాఖ్యానించారు.
తన అభ్యర్థిత్వానికి మద్దతు కోరేందుకు చేపట్టిన ప్రచారంలో భాగంగా గౌహతి చేరుకున్న థరూర్.. ఈ ఎన్నికలో అధికారిక అభ్యర్థి ఉన్నారని కొందరు భావిస్తున్నారని, ఆయన మల్లిఖార్జున్ ఖర్గేయేనని అంటున్నారని చెప్పారు. అయితే ఖర్గే తనకు కూడా లీడరేనని.. తాము శత్రువులం కామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ లో మార్పును కోరుతున్న అభ్యర్థిని తానని స్పష్టం చేశారు. నా అభ్యర్థిత్వానికి మద్దతు కోరేందుకే ఇక్కడికి వచ్చా అని చెప్పారు.
కొత్త అధ్యక్షుని నాయకత్వం కింద పార్టీ మళ్ళీ దేశ ప్రజల సంక్షేమం కోసం పని చేయాల్సి ఉంటుందని, దశాబ్దాల తరబడి ఇది ప్రతి అధ్యక్షుని నేతృత్వంలో పని చేసిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇక నూతన అధ్యక్షుని బాధ్యత.. 2024 ఎన్నికలకు ఇతర పార్టీలను కలుపుకుని పోవలసి ఉంటుందన్నారు. ఓ కొత్త జాతీయ కూటమిని ఏర్పాటు చేయడమే తమ మొదటి టెస్ట్ అని ఆయన అభివర్ణించారు. ఇప్పటివరకు ఖర్గే పట్ల కాస్త ‘సుద్దులు’ పలికిన శాతిథరూర్ వైఖరి మారినట్టు కనిపిస్తోంది. సోమవారం పార్టీ అధ్యక్ష ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆయన ‘సర్డుకు పోదాం’ అనే స్థితికి వచ్చారని అంటున్నారు.