తనను ప్రభుత్వం జైలుకు పంపినా, చంపినా ప్రజలు తమ హక్కులకోసం పోరాటాన్ని కొనసాగించాలని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. పోలీసులు నన్ను అరెస్టు చేయడానికి వచ్చారని, నేను జైలుకు వెళ్తే ప్రజలు ఇక నిద్ర పోతారని వాళ్ళు భావిస్తున్నారని, కానీ ఇది తప్పని మీరు నిరూపించాలని ఆయన మంగళవారం ఓ వీడియో సందేశంలో అన్నారు.
మీ హక్కుల కోసం మీరు పోరాడవలసిందే.. వీధులకెక్కి పెద్ద సంఖ్యలో ఆందోళనలు చేయవలసిందే.. మీ కోసం నేను పోరాటం చేస్తున్నాను నన్ను వారు జైలుకు పంపినా, హతమార్చినా మీరు వెనుకంజ వేయద్దు ..ఇమ్రాన్ లేకుండానే మేం పోరాడగలమని నిరూపించండి అన్నారు.
బానిసత్వాన్ని సహించబోమని, ఏక వ్యక్తి పాలను వ్యతిరేకిస్తామని మీరు ఈ ప్రభుత్వానికి ధైర్యంగా చెప్పండి అని ఆయన పేర్కొన్నారు. లాహోర్ లో తనను అరెస్టు చేయడానికి పోలీసులు వస్తున్నారని, కానీ మీరు ఎట్టిపరిస్థితుల్లోనూ మీ ఆందోళనను ఆపవద్దని తన మద్దతుదారులను ఉద్దేశించి ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.
తోషిఖానా అవినీతి కేసులో ఆయనను దోషిగా కోర్టు గతంలో ప్రకటించింది. ఆయనకు జారీ చేసిన పలు సమన్లకు స్పందించకపోవడంతో ఇటీవలే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ కూడా జారీ చేసింది. మంగళవారం పోలీసులు ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులను ఆయన మద్దతుదారులు పెద్ద సంఖ్యలో అడ్డుకున్నారు. అనేక చోట్ల వారికీ, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి.