ఢిల్లీ లిక్కర్ స్కాంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు డీకే అరుణ తనదైన శైలిలో స్పందించారు.మీ తప్పులు బయటపడతాయనే బీజేపీపై ఎదురు దాడికి పాల్పడుతున్నారని విమర్శించారు.
కల్వకుంట్ల కుటుంబం సానుభూతి కోసం ప్రయత్నిస్తోందన్నారు.ఏ తప్పూ చేయకపోతే ఈడీ, సీబీఐకి ఎందుకు భయపడుతున్నారని ఆమె ప్రశ్నించారు.కవిత జైలుకు వెళ్లాల్సి వస్తే ఆమె చేసిన అవినీతి వలనే వెళ్తారని తెలిపారు.ప్రజల కోసం జైలుకు వెళ్లేందుకు సిద్ధం అన్నట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందని డీకే అరుణ ఎద్దేవా చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ తన పేరును ప్రస్తావించడంపై కవిత స్పందించారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏ రాష్ట్రానికైనా మోడీ పోయే ముందు.. ఈడీ రావడం చూస్తూనే ఉన్నామని అన్నారు. తెలంగాణలో వచ్చే ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు ఉన్నాయి కనుకే.. మోడీ కన్నా ముందు ఈడీ వచ్చిందని విమర్శించారు. ఇది కామనే అని అన్నారు. ఇలాంటి వాటిని పట్టించుకునే అవసరం లేదని అన్నారు.
దర్యాప్తు సంస్థలు వచ్చి ప్రశ్నలు అడిగితే సమాధానం చెబుతున్నామని కవిత తెలిపారు. మీడియాలో లీక్‌లు ఇచ్చి నాయకులకు ఉన్న మంచి పేరు చెడగొడున్నారని విమర్శించారు ఇలాంటి వాటిని ప్రజలు తిప్పికొడతారని అన్నారు. ఈ పంథా మార్చుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. ఈడీ, సీబీఐలను ప్రయోగించి గెలవాలని అనుకుంటే చైతన్యవంతమైన తెలంగాణలో అది కుదరని పని అన్నారు.
కేసులు పెడతాం, జైల్లో పెడతామంటే పెట్టుకోండి.. భయపడేది లేదని అన్నారు. జైలులో పెడితే ఏమైతది అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని అన్నారు.